దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం-21 మంది మృతి
అమరావతి: దేశ రాజధాని ఢిల్లీ, మాల్వియ నగర్‌లోని లెమన్ గ్రీన్ ఇన్ అనే హోటల్ లో ఉదయం 9.00 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.అగ్ని ప్రమాదంలో దాదాపు 21 మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేర.. రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో మొదలైన మంటలు క్రమేపి పై అంతస్తుల వరకు వ్యాపించాయి.బిల్డింగ్ క్రింద నుంచి మంటలు రావడంతో,పై అంతస్థుల్లో వున్నవారు తప్పించుకునే అవకాశం లేకపోయిందని సమాచారం. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సిబ్బంది శ్రమించి వీరిలో దాదాపు 37 మంది రక్షించారు. అందులో అగ్నిప్రమాదం మొదలైన బేస్‌మెంట్‌లో చిక్కుకున్న పలువురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
ప్రమాదానికి కారణం:- హోటల్‌లో దాదాపు 25 గదులు ఉండగా, సుమారు 40 మంది అతిథులు బస చేసినట్లు సమాచారం. వారిలో ఎక్కువమంది వైద్య చికిత్స కోసం వచ్చిన విదేశీయులే అని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లోని అతిథులు నిద్రలో ఉన్నట్లు సమాచారం. ఉదయం 8.00 గంటలప్రాంతంలో ఎలక్ట్రిక్ స్టవ్‌ను ఆన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయని హోటల్ సిబ్బంది తెలిపారు.

