AP&TG

సామాన్యులే పన్నులు కడుతున్నప్పుడు.. సంస్థలు ఎగవేస్తే ఎలా? ఉప ముఖ్యమంత్రి

అమారావతి: ‘పంచాయతీలు ఇచ్చే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వినియోగించుకుంటున్న విద్యాసంస్థలు, పరిశ్రమలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాల’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీల పరిధిలో ఉన్న పలు సంస్థలు ఉద్దేశపూర్వక పన్ను ఎగవేత చర్యలకు పాల్పడుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యాసంస్థలు, పరిశ్రమలు పన్నుల చెల్లింపు వ్యవహారంలో పారదర్శకత పాటిస్తే పంచాయతీలకు ఆర్థిక స్వావలంబన దక్కుతుందని తెలిపారు. పన్ను ఎగవేతల కారణంగా రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయన్నారు. పంచాయతీల్లో ఎన్ని విద్యాసంస్థలు ఉన్నాయి? ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి? ఎంత వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నాయి? ఎంత నీరు వాడుకుంటున్నాయి? ఏఏ సౌకర్యాలు వినియోగించుకుంటున్నాయి? ఎంత పన్ను చెల్లిస్తున్నాయి? అనే అంశాలపై అధ్యయనం జరిపేందుకు ఓ సాధికార కమిటీని ఏర్పాటు చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీలకు పరిశ్రమలు, విద్యాసంస్థల పన్ను ఎగవేతపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న పరిశ్రమలు, విద్యా సంస్థలు, హ్యాచరీలు తదితర సంస్థల నుంచి పన్నుల వసూళ్లలో ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగి తన జీతంలో సర్వీస్ టాక్స్ రూపంలో పన్ను కడుతున్నారు:- ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ప్రయివేటు విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కూడా పెద్ద ఎత్తున కడుతున్నారు. ఆ విద్యా సంస్థలు పంచాయతీల పరిధిలో ఉంటున్నాయి. పన్నులు సరిగా చెల్లించడం లేదు. విద్యాసంస్థలు, పరిశ్రమలు పంచాయతీలకు కడుతున్న పన్నులపై రీ అసెస్మెంట్ జరపాలి. నిర్మాణాల విలువ తగ్గించి చూపడం, ఉద్దేశపూర్వకంగా పన్నులు తక్కువ చూపడం చేస్తున్నారు. వేల మంది విద్యార్థులు ఉన్న విద్యాసంస్థలు సైతం పంచాయతీలు ఇచ్చే సౌకర్యాలు తీసుకుంటున్నాయి. పన్నులు మాత్రం కట్టడం లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తనకి వచ్చే జీతంలో సర్వీస్ టాక్స్ రూపంలో పన్ను కడుతున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి చేపల వేట మీద జీవనం సాగించే మత్స్యకారులు కూడా పన్నులు కడుతున్నారు. దిగువ మధ్య తరగతి వాళ్లు సైతం పన్నులు కడుతున్నప్పుడు విద్యాసంస్థలు, పరిశ్రమలు ఎందుకు సరిగా పన్నులు కట్టడం లేదు? పరిశ్రమలు, విద్యాసంస్థలు, హోటల్స్ ఎంత వ్యర్థాలు విడుదల చేస్తున్నాయి? ఎంత నీటిని వినియోగించుకుంటున్నాయి? పన్నులు చెల్లించేందుకు ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి? ఎగవేతల వెనుక రాజకీయ ప్రమేయాలు ఏమైనా ఉన్నాయా? సబ్సిడీలు ఏమైనా ఇచ్చామా? అనే అంశాలపై నివేదికలు రూపొందించండని అదేశించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *