కృష్ణపట్నం పోర్టు నుంచి వియత్నాంకు మొక్కజొన్న ఎగుమతి నౌక ప్రారంభం
నెల్లూరు: నెల్లూరు జిల్లా రైతులు పండించిన మొక్కజొన్నకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల్లో భాగంగా కృష్ణపట్నం పోర్టు నుంచి వియత్నాంకు మొక్కజొన్న ఎగుమతి నౌకను మంగళవారం ప్రారంభించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ (AKPL) ముఖ్య కార్యనిర్వాహణ అధికారి జగదీష్ పటేల్‌తో కలిసి కృష్ణపట్నం పోర్టులో మొక్కజొన్న ఎగుమతి నౌకను జెండా ఊపి ప్రారంభించారు.ఎం.వి. పర్వరాజ్ పేరుతో బయలుదేరిన ఈ నౌక ద్వారా 53,318 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను వియత్నాంకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో మొక్కజొన్న పంట అధికంగా దిగుబడి రావడంతో రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ మొక్కజొన్న ఎగుమతులకు అవసరమైన ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఈ కార్యక్రమంలో పోర్టు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

