ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం లెక్కలు తేల్చండి-మంత్రి సత్యకుమార్
కోవిడ్ -19 తర్వాత భారీగా పెరిగిన ఆక్సిజన్ కొనుగోలు..
రూ.105 కోట్లతో నిర్మితమై, నిరుపయోగంగా ఉన్న 161 పీఎస్ఏ ప్లాంట్లు..
అమరావతి: కోవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం దాదాపు రూ.105 కోట్లతో నిర్మితమై నిరుపయోగంగా మారిన పీఎస్ఏ ( ప్రెషర్ స్వింగ్ అడ్సార్పషన్ ) ప్లాంట్లు, అధిక మోతాదులో ఎల్ఎంఓ (లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్) కొనుగోళ్ల విషయాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం నాడు మంగళగిరి ఎపిఐఐసి టవర్స్‌లోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎల్ఎంఓ కొనుగోళ్లకు సంబంధించి, వాస్తవ డిమాండ్, సరఫరా విషయాలపై రెండు వారాల్లో సమగ్రంగా ఆడిట్ నిర్వహించి, లోపాల గుర్తింపు, సవరణ చర్యలను చేపట్టి, ఆమేరకు ఎనిమిది ప్రభుత్వాసుపత్రుల్లో రెండు నెలలపాటు అమలుపరిచి అక్టోబరు 15 లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని మంత్రి ఆదేశించారు. తద్వారా ఎల్ఎంఓ డిమాండ్-సరఫరాలోని వ్యత్యాసాన్ని గుర్తించి ఆక్సిజన్ కొనుగోలు ఖర్చును వీలైనంత వరకు కొవిడ్-19 పూర్వ స్థితికి తీసుకురావాలని మంత్రి స్పష్టంచేశారు.
భారీగా పెరిగిన ఆక్సిజన్ కొనుగోలు:- కోవిడ్-19 తీవ్రంగా ఉన్న 2020-21, 2021-22 సంవత్సరాల్లో రూ.95.43 కోట్ల మేరకు బోధనాసుపత్రుల్లో ఏల్ఏoఓ కొనుగోలు చేశారు. కోవిడ్-19కు ముందు 2016-20 మధ్య కాలంలో (నాలుగేళ్లు) రూ.60.51 కోట్ల మేరకు వ్యయం చేశారు. కొవిడ్ అనంతరం 2022-26 మధ్య నాలుగేళ్ల కాలంలో ఎల్ఎంఓ కొనుగోలు వ్యయం రూ.180.82 కోట్లకు చేరిందని మంత్రి సమీక్షా సమావేశంలో గుర్తించారు.
ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్, డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్, ఏడీఎంఈ డాక్టర్ రాధికారెడ్డి, డీఎంఈ జాయింట్ డైరెక్టర్ గణపతిరావు, డీఎస్ఎచ్ జాయింట్ కమిషనర్ డాక్టర్ సుజాత, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

