AP&TG

ఉత్తరాంధ్రకు గోదావరి-జలం జీవం, జీవితం,నీరుంటేనే సాగు-సీఎం జలహారతి

పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ఉత్తరాంధ్రకు నీటి విడుదల..

4 జిల్లాల్లో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9 లక్షల మందికి తాగునీరు.

అమరావతి: పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రలోకి అడుగుపెట్టాయి. పాయకరావుపేట వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి ప్రవహించిన గోదారమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు. అక్కడే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.గోదావరి జలాలకు పుష్పాలు, పసుపు కుంకుమ సమర్పించిన సీఎం..జలహారతి ఇచ్చారు. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా విడుదల చేసిన నీటితో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లోని 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9.23 లక్షల మందికి తాగునీరు ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక చేసింది.

ఇక ఉత్తరాంధ్రకే:- నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి భద్రత ఉంటుందని సీఎం చెప్పారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాల్లో భారీ పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ఆరు నెలల క్రితం అనకాపల్లిలో ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. పెద్ద డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు వస్తున్నాయని, ఆసియా మొత్తాన్ని అనుసంధానించే సబ్‌సీ కేబుల్‌ కనెక్టివిటీ కూడా రానుందని తెలిపారు. హార్బర్లు, మూలపేట పోర్టుల ద్వారా తూర్పు తీరాన్ని మధ్య భారత్‌తో అనుసంధానిస్తా మన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిరునామాగా:- గూగుల్‌ హబ్‌గా, నాలెడ్జ్‌ ఎకానమీ కేంద్రంగా, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిరునామాగా నిలుస్తుందని చెప్పారు. డేటా సెంటర్లకు నీరు, విద్యుత్‌ కొరత వస్తుందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డేటా సెంటర్లకు అవసరమైన నీటితో పోలిస్తే పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే నీటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అన్ని డేటా సెంటర్లకూ కేవలం 5 టీఎంసీల నీరు సరిపోతుందని,ఎడమ కాలువ ద్వారా రోజుకు 2 టీఎంసీల నీరు తీసుకెళ్లే సామర్ధ్యం ఉందని అన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు సీ.ఎం.సభా వేదిక నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *