నగరంలోకి ప్రవేశించే మార్గాల్లో వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి-కలెక్టర్ హిమాన్షు శుక్ల
రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వం ఉచిత వైద్యం..
ప్రధాన కూడళ్లలో ఆక్రమణలు తొలగించాలి..
ప్రమాదాల్లో క్షతగాత్రులను కాపాడిన వారికి ప్రోత్సాహకం రూ.5 వేల నుంచి రూ.25 వేలకు..
వచ్చే సమావేశంలోపు పరిష్కార మార్గం చూపించాలి..
నెల్లూరు: నగరంలోకి ప్రవేశించే మార్గాల్లో వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేయాలని, హెల్మెట్ ధరించని వాహనదారులను నగరంలోకి అనుమతించకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కమిటీలోని అధికారులకు సూచించారు. జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎన్‌హెచ్ అధికారులు నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు రేడియం పెయింటింగ్ వేయాలని సూచించారు. హైవేలపై రాంగ్ రూట్‌లో వచ్చే వాహనాలను గుర్తించి చర్యలు చేపట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఆ వివరాలను పోలీసులకు అందించాలని అన్నారు.
క్షతగాత్రులకు గోల్డెన్ అవర్‌లో వైద్యం అందించాలి:- రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో చేర్పించి, ఒక గంట గోల్డెన్ అవర్‌లో వైద్య చికిత్స అందించేందుకు సహాయం చేసిన వారికి గుడ్ సమారిటన్ ప్రోత్సాహకాన్ని రూ.5 వేల నుంచి రూ.25 వేలకు పెంచినట్లు కలెక్టర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలకు గురై నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితులకు తక్షణ సాయం అందించి వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రజలను ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ప్రతి ఒక్కరూ తోటివారి ప్రాణాలను కాపాడేందుకు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వం ఉచిత వైద్యం:- అలాగే ఆసుపత్రిలో చేరిన క్షతగాత్రులను ఈడార్‌లో నమోదు చేసి, పోలీసుల సహకారంతో రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తుందని తెలిపారు. ఈ విషయాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ప్రధాన కూడళ్లలో ఆక్రమణలు తొలగించాలి:- నెల్లూరు నగర పరిధిలోని మద్రాసు బస్టాండ్, ఆర్టీసీ, ఆత్మకూరు బస్టాండ్, స్టోన్‌హౌస్‌పేట ప్రధాన కూడళ్ల వద్ద రోడ్డు మార్జిన్ ఆక్రమణలు లేకుండా ట్రాఫిక్ సమస్యల నివారణకు మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా పరిశీలించి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
ప్రైవేటు ట్రావెల్ బస్సుల పార్కింగ్:- అలాగే ప్రైవేటు ట్రావెల్ బస్సుల పార్కింగ్ కోసం సర్వోదయ కళాశాల గ్రౌండ్, కేవీఆర్ సమీపంలోని దేవాదాయ శాఖ ఖాళీ స్థలాలను పరిశీలించి, ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. టోల్‌గేట్ వద్ద టాయిలెట్లు ఉన్నట్లు తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కావలి సమీపంలో ఉన్న ట్రక్ లేబై సమాచారాన్ని కూడా వాహనదారులకు తెలియజేసేలా సైనేజ్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
వచ్చే సమావేశంలోపు పరిష్కార మార్గం చూపించాలి:- సమావేశంలో చర్చించిన అంశాలకు వచ్చే సమావేశంలోపు పరిష్కార మార్గం చూపించాలని, చేపట్టిన చర్యలపై యాక్షన్ టేకన్ రిపోర్టుతో తదుపరి సమావేశానికి హాజరు కావాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఏఎస్పీలు దీక్ష, సౌజన్య, డీఆర్‌ఓ విజయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ నందన్, జిల్లాస్థాయి అధికారులు, ట్రాఫిక్, పోలీసుశాఖ అధికారులు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

