AGRICULTUREDISTRICTSOTHERS

ఏ ఒక్క ఎకరా ఎండిపోకుండా రైతాంగాన్ని ఆదుకుంటాం-కలెక్టర్ హిమాన్షు శుక్ల

సైఫన్ పునర్నిర్మాణంతో పాటు కావలి కాలువ ఆధునికీకరణ..

కావలి, ఉదయగిరి ఎమ్మేల్యేలు..

కావలి కాలువపై వారాబంధీ విధానాం..

నెల్లూరు: కావలి నియోజకవర్గంలో ఏ ఒక్క ఎకరా పంట కూడా ఎండిపోకుండా రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కావలి కాలువలో నీటి నిర్వహణ, 12వ కిలోమీటరు వద్ద దెబ్బతిన్న సైఫన్, చివరి ఆయకట్టు వరకు సాగునీటి సరఫరాపై విస్తృతంగా చర్చించారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఇరిగేషన్ అధికారులు, నీటి సంఘాల ప్రతినిధులు, రైతులు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కావలి కాలువ పరిధిలోని ఇంజన్ మోటార్లు గల రైతులకు వారానికి మూడు రోజులు సాగునీరు అందించే విధంగా కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, మిగిలిన నాలుగు  రోజుల్లో అనధికార మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి కాలువ చివరి భాగంలోని రైతులకు కూడా సమానంగా నీరు అందేలా చర్యలు చేపడతామని చెప్పారు.

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, కావలి కాలువ 12వ కిలోమీటరు వద్ద దెబ్బతిన్న సైఫన్‌ను స్వయంగా పరిశీలించామని, దీని కారణంగా చివరి ఆయకట్టు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ, కావలి కాలువ రైతాంగానికి సాగునీరు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా నీటి నిర్వహణ చేపట్టాలని, ఈరోజు నుంచే వారాబందీ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, నీటి విడుదల జరిగే నాలుగు రోజులపాటు కాలువపై ఉన్న మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని సూచించారు. సెప్టెంబర్ 15 వరకు ఏ కాలువకు ఎంత మేర నీటిని విడుదల చేయాలనే కార్యాచరణను సిద్ధం చేయాలని, ప్రతి రైతు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.

ఈ సమావేశంలో సోమశిల ఎస్‌ఈ శ్రీరామ్ చంద్రమూర్తి, ఇరిగేషన్ ఎస్‌ఈ దేశ నాయక్, కందలేరు ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం, ఎలక్ట్రికల్ ఎస్‌ఈ రాఘవేంద్ర, ఆత్మకూరు, కావలి ఆర్డీవోలు పావని, ఎలీషా, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, నీటి సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *