వెలిగొండ ఘనత వైఎస్సార్, జగన్‌లదే-వారి కష్టంతోనే ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమైంది-మాజీ మంత్రి అనిల్ కుమార్
తట్టెడు మట్టి ఎత్తని బాబు భగీరథుడిలా బిల్డప్ ఇస్తున్నాడు..
అధికారం కోసం మాగుంట శ్రీనివాసులు రెడ్డి..
37 కిలోమీటర్ల టన్నెల్స్‌లో 30.5 కి.మీ. వైఎస్సార్, జగన్ హయాంలోనే పూర్తి..
నల్లమల సాగర్ రిజర్వాయర్‌లో 97 శాతం పనులు వారిద్దరి హయాంలోనే..
శంకుస్థాపనలు చేయడం తప్ప చంద్రబాబు చేసింది శూన్యం..
నెల్లూరు: వెలిగొండ ప్రాజెక్టు తానే ప్రారంభించి, తానే పూర్తి చేసినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతూ ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.1996లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు, ఆ తర్వాత ఎనిమిదేళ్ల తన పాలనలో కనీసం జేసీబీతో ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు. ఇతరులు కట్టిన ఎయిర్పోర్టులు, డేటా సెంటర్లకు పేర్లు మార్చి తానే తెచ్చానని ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని మండిపడ్డారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం కింద చేపట్టిన 37.5 కిలోమీటర్ల మేర రెండు మేజర్ టన్నెల్స్ పనుల్లో.. దాదాపు 30.5 కిలోమీటర్ల పనులను (80 శాతం) తండ్రీకొడుకులు వైఎస్సార్, జగన్ లు పూర్తి చేశారని అనిల్ గణాంకాలతో వివరించారు. 2004 నుంచి 2014 మధ్య వైఎస్సార్ హయాంలో 20 కిలోమీటర్ల టన్నెల్ పనులు జరిగితే, 2014-19 మధ్య చంద్రబాబు కేవలం 6.6 కిలోమీటర్లు మాత్రమే చేశారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రెండేళ్ల కరోనా కష్టకాలం, కృష్ణా నదిలో విపరీతమైన వరదలు ఉన్నప్పటికీ.. రికార్డు స్థాయిలో 10.5 కిలోమీటర్ల పనులు పూర్తి చేసి 2024 జనవరిలో జగన్ చేతుల మీదుగా జాతికి అంకితం చేసినట్లు గుర్తుచేశారు. చంద్రబాబు పాలనలో రోజుకు 2.4 మీటర్ల పనే జరిగితే, జగన్ పాలనలో సగటున రోజుకు 4.5 మీటర్ల వేగంతో పనులు జరిగాయన్నారు. 2014-19 మధ్య ఈ ప్రాజెక్టు కోసం నిధులు ఖర్చు చేశానని చంద్రబాబు చెబుతున్నారని, కానీ ఆయన చేసిందల్లా అంచనాలు పెంచి దోచుకోవడమేనని విమర్శించారు. టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషిన్)ల పేరుతో వందల కోట్లు ఎక్సెస్ ఇచ్చారని సాక్షాత్తూ కాగ్ రిపోర్టే కుండబద్దలు కొట్టిందని గుర్తుచేశారు. ఇందులో రూ.700 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని కాగ్ నివేదిక స్పష్టం చేసిందని అనిల్ దుయ్యబట్టారు.
నల్లమలసాగర్ రిజర్వాయర్ పూర్తి చేసింది తండ్రీకొడుకులే:- 55 టీఎంసీల కెపాసిటీ ఉన్న నల్లమల సాగర్ మేజర్ రిజర్వాయర్ పనుల్లో 82 శాతం వైఎస్సార్, 15 శాతం జగన్ పూర్తి చేస్తే, చంద్రబాబు చేసింది కేవలం 3 శాతం మాత్రమేనని అనిల్ స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు 120 కోట్లతో ఫీడర్ కెనాల్ డిజైన్ చేస్తే, దాన్ని చంద్రబాబు రూ. 500 కోట్లకు అంచనాలు పెంచుకుని దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. వెలిగొండ రెండు ప్రధాన హెడ్ రెగ్యులేటర్లు, 30 కిలోమీటర్ల మేజర్ కెనాల్స్ పనులన్నీ మా ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని స్పష్టం చేశారు. జగన్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే మార్కాపురంలో మెడికల్ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను ఈ కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మరుగున పడేసిందని ఆయన విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టుపై ఎన్ని అబద్ధాలు చెప్పినా, సోషల్ మీడియాలో ఎంత ప్రచారం చేసినా వాస్తవాలు మారవని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏ సమయంలో ఏ పని జరిగిందో ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా ఉందని, ప్రజలు కూడా అన్నింటినీ గమనిస్తున్నారని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచడమే తమ ఉద్దేశమన్నారు.
ఆందోళనలో నెల్లూరు రైతాంగం:- నెల్లూరు స్థానిక రాజకీయాలపై స్పందిస్తూ.. అధికారం కోసం మాగుంట శ్రీనివాసులు రెడ్డి లాంటి వారు సైతం కులం పేరుతో విమర్శలు చేస్తూ దిగజారడం బాధాకరమన్నారు. తమ ఐదేళ్ల పాలనలో శ్రీశైలంలో పుష్కలంగా నీళ్లు ఉండటం వల్ల పట్టిసీమ వాడాల్సిన అవసరం రాలేదని, అయితే ఇప్పుడు రాబోయే రెండు నెలల్లో నెల్లూరు జిల్లాకు మొదటి పంటకు నీళ్లు వస్తాయో లేదోనని రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోందని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో పెన్నా, నెల్లూరు బ్యారేజీల పూర్తితో పాటు సుమారు 3 వేల కోట్ల సాగునీటి పనులు జరిగాయని, కూటమి ప్రభుత్వం వచ్చాక కనీసం కోటి రూపాయల పనైనా జరిగిందా అని ఆయన నిలదీశారు. తాను రాజకీయ టూరిస్టును కాదని, పార్టీకి మరియు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందుండి గొంతెత్తే సైనికుడినని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

