తిరుపతిలో వైభవంగా ‘అమరావతి ఛాంపియన్‌షిప్ – 2026’ ఏర్పాట్లు-జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి: జాతీయ క్రీడా దినోత్సవం (ఆగష్టు29) సందర్భంగా మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న”అమరావతి ఛాంపియన్‌షిప్– 2026″ రాష్ట్ర స్థాయి పోటీలకు తిరుపతి నగరం సర్వసన్నద్ధమవుతోందని జిల్లాకలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ గోవిందరావు పాల్గొన్నారు. ఈ పోటీల నిర్వహణపై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ (VC) ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి, పలు మార్గదర్శకాలను జారీ చేశారు.
ప్రధాన వివరాలు:-
పోటీల తేదీలు & వేదికలు: ఈ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఆగస్టు 24 నుండి 27 వరకు తిరుపతిలోని వివిధ మైదానాల్లో జరుగుతాయి.
భారీ భాగస్వామ్యం: రాష్ట్రవ్యాప్తంగా అండర్-17, అండర్-21 విభాగాల్లో (బాలురు, బాలికలు) సుమారు 12,000 మంది క్రీడాకారులు, కోచ్‌లు మరియు మేనేజర్లు పాల్గొననున్నారు.
క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, చెస్, హాకీ, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్ మరియు యోగాతో సహా మొత్తం 12 రకాల క్రీడల్లో పోటీలు నిర్వహిస్తారు.
నగదు బహుమతులు: విజేతలుగా నిలిచే 956 మంది క్రీడాకారులకు (478 మంది విజేతలు, 478 మంది రన్నరప్‌లు) మొత్తం రూ.91.90 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నారు. ముగింపు వేడుకలు ఆగస్టు 29న విజయవాడలో జరుగుతాయి.
శాఖల వారీగా ఆదేశాలు:–
వసతి & రవాణా: క్రీడాకారుల కోసం శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, పద్మావతి మహిళా వర్సిటీలతో పాటు ప్రధాన పాఠశాలల్లో వసతి ఏర్పాట్లు చేశాం. ఆటగాళ్ల రవాణా కోసం 35 ప్రత్యేక బస్సులను కేటాయించడం జరిగింది.
రక్షణ & భద్రత: క్రీడా వేదికలు-వసతి గృహాల వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. బాలికల వసతి వద్ద ప్రత్యేకంగా మహిళా కానిస్టేబుళ్లను నియమిస్తున్నాం.
పారిశుధ్యం & తాగునీరు: నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని వేదికల వద్ద తాగునీరు, 50 మొబైల్ టాయిలెట్లు మరియు నిరంతర పారిశుధ్య సేవలు అందిస్తారు.
వైద్యం & విద్యుత్: ప్రతి క్రీడా ప్రాంగణంలో వైద్య బృందాలు, అంబులెన్సులు సిద్ధంగా ఉంటాయి. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అంతరాయం లేని విద్యుత్ సరఫరా-తారకరామ స్టేడియంలో అగ్నిమాపక యంత్రాన్ని అందుబాటులో ఉంచుతున్నాం. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో DSDO, మున్సిపల్ అధికారులు మెడికల్ అధికారులు, స్పోర్ట్స్ సిబ్బంది జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

