DISTRICTS

SIR ప్రక్రియలో 38,645 డూప్లికేట్ ఓట్లు-31వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా-కలెక్టర్ హిమాన్షు శుక్ల

85.28 శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేశాం..

నెల్లూరు: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision–SIR) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో SIR కార్యక్రమం పురోగతి, గణాంకాలు, తదుపరి చర్యలపై కలెక్టర్ వివరాలు వెల్లడించారు.

జూన్ 15 నుంచి జూలై 24 వరకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించామని తెలిపారు. జిల్లాలోని మొత్తం 19,74,240 మంది ఓటర్లలో 16,83,557 మంది నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించి 85.28 శాతం మ్యాపింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు.

మ్యాపింగ్ పూర్తైన వారిలో 83.5 శాతం మందిని 2002 ఓటర్ల జాబితాతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వివరాల ఆధారంగా అనుసంధానం చేయడం జరిగిందని, ఇది రాష్ట్రంలోనే ఒక విశేషమైన పురోగతిగా పేర్కొన్నారు.

మ్యాపింగ్ కాని 1.8 శాతం మంది ఓటర్లకు భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన 12 రకాల అధికారిక గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి సంబంధిత ఈఆర్‌ఓకు సమర్పిస్తే వారి ఓటు హక్కు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

SIR ప్రక్రియలో 38,645 డూప్లికేట్ ఓట్లు (1.96 శాతం) గుర్తించామని, సంబంధిత ఓటర్ల అంగీకారంతో వాటిని తొలగిస్తామని తెలిపారు. అలాగే 1,13,421 మంది (5.75 శాతం) శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిగా, 80,699 మంది (4.09 శాతం) మరణించిన వారిగా, 57,077 మంది (2.89 శాతం) అందుబాటులో లేని వారిగా గుర్తించినట్లు వివరించారు. ఉపాధి నిమిత్తం తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చి అవసరమైన ఆధారాలు సమర్పిస్తే వారి ఓటు హక్కును పునరుద్ధరిస్తామని తెలిపారు.

ఈ నెల 31వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని, అనంతరం దానిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడంతో పాటు గుర్తింపు పొందిన ఎనిమిది రాజకీయ పార్టీలకు ప్రింట్, పెన్‌డ్రైవ్ రూపంలో అందజేస్తామని చెప్పారు. డ్రాఫ్ట్ ప్రచురణ అనంతరం 30 రోజుల పాటు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామని, అర్హులైన ఓటర్లు తమ పేర్లు లేకపోయినా లేదా వివరాల్లో లోపాలు ఉన్నా సంబంధిత ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలను సంప్రదించి సవరించుకోవచ్చన్నారు.

అర్హత ఉన్న ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం, ఒకరికి ఒకే ఓటు ఉండేలా చూడటమే భారత ఎన్నికల సంఘం లక్ష్యం.  సీఈఓ వివేక్ యాదవ్  సూచనలు సలహాల మేరకు జిల్లాలో సర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేయగలిగాం.  అలాగే గత 45 రోజులుగా సెలవులు కూడా తీసుకోకుండా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసిన సచివాలయ సిబ్బంది, బీఎల్‌వోలు, తాసిల్దార్లు, ఆర్‌డీవోలు,  ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులకు నా ప్రత్యేక అభినందనలు,” అని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు. సర్ ప్రక్రియలో కీలకంగా పనిచేసి విజయవంతం చేసిన జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ విజయ్ కుమార్ ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *