త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి..
శ్రీకృష్ణునికి,శ్రీరామ స్వామి,అయ్యప్పస్వామి..
దీపాలంకరణ, మీనుట్టు, వేది వజిపాడు సేవల్లో..
అమరావతి: సుప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం, నాలాంబలం యాత్రలో విఖ్యాతిగాంచిన క్షేత్రాల్లో ఒకటిగా పేరు పొందిన కేరళం రాష్ట్రంలోని త్రిప్రయార్ శ్రీ రామస్వామి వారిని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం విశిష్ట సేవల్లో ఒకటిగా పేరున్న దీపారాధన సేవలో పాల్గొన్నారు. ఒక్క రోజు దీపారాధన సేవకు విరాళం అందించి, స్వయంగా దీపాలు వెలిగించి సేవలో పాల్గొన్నారు. ఆలయం ప్రధాన ద్వారం ఎదురుగా, శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధాన దీపాల్లో జ్యోతి ప్రజ్వలన గావించారు. దీపారాధనతోపాటు ఆలయ సంప్రదాయాలను అనుసరించి మీనుట్టు, వేది వజిపాడు సేవల్లోనూ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. శంఖుచక్రాలతోపాటు ధనుస్సు, హారం ధరించిన శ్రీ రామస్వామి వారి అద్భుత రూపాన్ని దర్శించి, సంధ్యాకాల అర్చనలు నిర్వహించారు. శ్రీరామ స్వామి వారితో పాటు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీకృష్ణునికి, అయ్యప్ప స్వామకి పట్టు వస్త్రాల సమర్పించారు. అనంతరం గర్భాలయంలో మూలవిరాట్టుకి కుడివైపు ఉన్న దక్షిణా మూర్తికి, నైరుతి దిక్కున ఉన్న వినాయకుడికి, అనంతపద్మనాభ స్వామి వారి శయన రూపానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మేల్ శాంతి(ప్రధాన అర్చకులు) రామన్ తిరుమేని పూజ అనంతరం పవన్ కళ్యాణ్ కి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు.

