రాబోయే రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృమైంది. రాబోయే రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటూ అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

