రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అరుదైన బహుమతి అందచేసిన ప్రధాని మోదీ
అమరావతి: బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం భారత్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్‌కు ప్రధాని మోదీ అరుదైన బహుమతి అందజేశారు. రష్యా రచయితలు, మేధావులను ప్రభావితం చేసిన ప్రాచీన తమిళ కావ్యం ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద పుస్తకాన్ని ఆయనకు బాహుమతిగా ఇచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. బ్రిక్స్ సదస్సుకు ముందు ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ సందర్శన సమయంలో ప్రాచీన తమిళ కావ్యం ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాదాన్ని పుతిన్‌కు ప్రధాని మోదీ బహుకరించారు. రష్యా రచయితలను ప్రభావితం చేసిన ఆ గ్రంథం గురించి మోదీ వివరించారు. ఈ ప్రాచీన పుస్తకం ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని తాను ఆశిస్తున్నానని అన్నారు.
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ ప్రచురించిన ఈ సంచికలో అసలైన తమిళ పద్యాలు, వాటి అనువాదం, నైరా మ్క్రిట్చ్యాన్ చేసిన రష్యన్ అనువాదం ఉన్నాయి. అయితే 17వ శతాబ్దం నాటికే భారతీయ తత్వశాస్త్రం, సాహిత్యం పట్ల రష్యన్లకు ఆసక్తి ఏర్పడింది. ఐరోపా భాషల్లోకి జరిగిన అనువాదాల ద్వారా రష్యన్ పండితులు, సాహిత్యవేత్తల దృష్టిని ‘తిరుక్కురళ్’ ఆకర్షించింది. రష్యాకు చెందిన అత్యంత ప్రసిద్ధ రచయితలలో ఒకరైన లియో టాల్‌స్టాయ్ 19వ శతాబ్దంలో ఒక అనువాదం ద్వారా ‘తిరుక్కురళ్’ గురించి తెలుసుకున్నారు. ధర్మం, కరుణ, అహింస వంటి అంశాలకు అందులో ఇచ్చిన ప్రాధాన్యత ఆయన తాత్విక రచనలపై ప్రభావం చూపిందని చరిత్రకారులు పేర్కొన్నారు.

