గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం పెంచండి-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
2026–27 లక్ష్యాలు రెండు నెలల్లో పూర్తి కావాలి..
గత రెండేళ్లలో మడ అడవుల విస్తరణలో దేశంలో ద్వితీయ స్థానం..
రాష్ట్రవ్యాప్తంగా 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణ..
తీర ప్రాంత జిల్లాలకు మరో 70 లక్షల మొక్కలు..
అమరావతి: తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ, కోతల నివారణ చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం మరింత పెరగాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలను వాతావరణ అనుకూలతల అనుగుణంగా వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ లక్ష్య సాధనలో భాగంగా గడచిన రెండేళ్ల కాలంలో సాధించిన పురోగతికి జాతీయ స్థాయి గుర్తింపు లభించిన అంశాన్ని గుర్తు చేశారు. మడ అడవుల విస్తరణలో దేశంలో రెండో స్థానం సాధించేందుకు కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలియజేశారు.
మరో 70 లక్షల మొక్కలు:- సోమవారం గ్రేట్ గ్రీన్ వాల్ పనుల పురోగతిపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. డివిజన్లవారీగా నిర్దేశించిన లక్ష్యాలు ఎంత వరకు పూర్తి చేశారు? ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు? ఈ ఏడాది మడ అడవులు ఎంత విస్తీర్ణంలో నాటనున్నారు? తదితర వివరాలను అంశాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీబీ జీ రాం జీ పథకంలో భాగంగా తీర ప్రాంత జిల్లాలకు అదనంగా మరో 70 లక్షల మొక్కలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్, ఇవి గ్రేట్ గ్రీన్ వాల్ లక్ష్య సాధనకు అదనపు బలం కానున్నాయని పేర్కొన్నారు.

