ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత
అమరావతి: గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు,నటుడు భారతీరాజా(84) బుదవారం కన్నుమూశారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. భారతీరాజా మరణ వార్తతో తమిళ సినీ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.2025 మార్చిలో భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీ రాజా కేవలం 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఈ విషాదాన్ని భారతీరాజా తట్టుకోలేకపోయారని కుటుంబ సభ్యులు, సన్నిహితులు వ్యాఖ్యనిస్తున్నారు. కొడుకు అంత్యక్రియల సమయంలో ఆయన తీవ్ర ఆవేదనకు గురైన దృశ్యాలు అప్పట్లో అందరినీ కలచివేశాయి. పుత్రశోకం నుంచి పూర్తిగా కోలుకోలేకపోయిన భారతీరాజా ఆరోగ్యం క్రమంగా మరింత బలహీనపడింది.
కుమారుడి మరణం తరువాత:- గత సంవత్సరం డిసెంబర్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఉబ్బసం కారణంగా భారతీరాజాను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందినప్పటికీ, వయసు పైబడటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి తరచూ ఆందోళనకరంగా మారింది. కుమారుడి మరణం తర్వాత మానసికంగా కూడా ఆయన తీవ్రంగా కుంగిపోయారని కుటుంబ సభ్యులు పలుమార్లు వెల్లడించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగానూ భారతీరాజా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తనదైన నటనతో ఎన్నో విభిన్న పాత్రలను పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల విడుదలైన తుడరుం చిత్రంలో ఆయన చివరిసారిగా కనిపించారు.
