మూలాపేట డీఎస్ఆర్ హైస్కూల్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలుస్తుంది-మంత్రి నారాయణ
నెల్లూరు: నెల్లూరు నగరంలోని మూలాపేటలో డీఎస్ఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న డీఎస్ఆర్ హైస్కూల్ నిర్మాణ పనులను మంత్రి నారాయణ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో కూడిన విద్యాలయాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పటికే నెల్లూరులోని వీఆర్ హైస్కూల్‌ను సిఎస్ఆర్ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అదే స్ఫూర్తితో మూలాపేట డీఎస్ఆర్ హైస్కూల్‌ను కూడా అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుతున్నామని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, కంప్యూటర్, రోబోటిక్స్ ల్యాబ్‌లతో పాటు క్రీడా సదుపాయాలు కల్పించేలా ప్రణాళికాబద్ధంగా పనులు జరుగుతున్నాయని వివరించారు.డీఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ సుధాకర్ రెడ్డి పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో పలు దశల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో తొలి దశ పనులు వేగంగా పూర్తవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్ఆర్ గ్రూప్ యాజమాన్యానికి మంత్రి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
డి ఎస్ ఆర్ గ్రూపు సంస్థల అధినేత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ సూచనల మేరకు అత్యాధునిక సౌకర్యాలతో డి ఎస్ ఆర్ హైస్కూల్ ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అద్భుతమైన ప్లేగ్రౌండ్, మినరల్ వాటర్ సౌకర్యం, విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేసేందుకు ప్రత్యేక గదిని కూడా నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు, స్టాఫ్ కు ప్రత్యేక క్వార్టర్స్ కూడా నిర్మిస్తున్నట్లు చెప్పారు. మూలపేట స్కూల్ తో ఉన్న ప్రత్యేక అనుబంధంతో ఈ పాఠశాలను ఎంపిక చేసుకుని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. మంత్రి గారికి ఇచ్చిన మాట మేరకు అది తక్కువ కాలంలోనే ఈ పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. అన్ని రకాల ల్యాబ్స్, 14 రకాల క్లాస్ రూమ్స్, పూర్తిస్థాయిలో కంప్యూటర్స్, ఫర్నిచర్ ఏర్పాటుచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసినట్లు చెప్పారు.మంత్రి వెంట మేయర్ సుజాత, డీఈఓ ఆర్ బాలాజీ రావు, స్థానిక నేతలు ఉన్నారు.

