పంచాయతీల నుంచి మురుగు నీరు నదిలోకి కలవకూడదు-ఉప ముఖ్యమంత్రి
మ్యాజిక్ డ్రెయిన్లతో మంచి ఫలితాలు..
అమరావతి: ‘గోదావరి పుష్కరాలను స్వచ్ఛంగా, శుభ్రంగా నిర్వహించాలన్నది కూటమి ప్రభుత్వ తపన. ఇందుకు అనుగుణంగా గోదావరి పుష్కరాలకు ఆతిథ్యం ఇచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దుతాం. పంచాయతీల నుంచి వచ్చే మురుగు నీరు చుక్క కూడా గోదావరిలోకి కలవడకుండా చర్యలు తీసుకోవాలి. జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీలుగా తీర్చేదిద్దే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలి. ఇందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేయాల’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై శనివారం గోదావరి పుష్కరాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లతో, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
మురుగు నీరు గోదావరిలో కలవకూడదు:- గోదావరిలోకి మురుగు నీరు కలవకుండా పక్కా చర్యలు తీసుకోవాలి. పంచాయతీల మురుగు నీటి వ్యవస్థను సరిదిద్దాలి. పుష్కరాలకు సంబంధించిన పంచాయతీల్లో సీసీ రోడ్లు, మ్యాజిక్ డ్రైయిన్ల ద్వారా మురుగు నీటిని సమూలంగా అరికట్టేలా పంచాయతీలవారీగా ప్రణాళికను సిద్ధం చేయండి. గోదావరిలోకి పంచాయతీల నుంచి చుక్క మురుగునీరు కూడా రాకుండా చేయాలి.
పనులను స్వయంగా పరిశీలిస్తాను:- నేను ఈ నెలలో మునికూడలి ఘాట్ ను సందర్శిస్తాను.చేయాల్సిన పనులను స్వయంగా పరిశీలిస్తాను. సమష్టిగా పనిచేసి పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలి’’ అన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, ఓఎస్డీ వెంకటకృష్ణ ఉన్నారు.

