విద్యే సమాజ మార్పుకు అత్యంత శక్తివంతమైన ఆయుధం-రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ సభ…
నెల్లూరు: ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య” అని నెల్సన్ మండేలా చెప్పిన సందేశాన్ని గుర్తుచేస్తూ, విద్యార్థులు తమ విద్యను వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ ఎస్.అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. మంగళవారం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 10, 11, 12వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డిగ్రీలు, పీజీ పట్టాలు, పీహెచ్‌డీలు-స్వర్ణ పతకాలు అందుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సీజీపీఏతో ‘A’ గ్రేడ్ పొందడం:- విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం గత పదిహేడు సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవల ద్వారా విశేష ప్రగతి సాధించిందని గవర్నర్ ప్రశంసించారు. విశ్వవిద్యాలయం ఇటీవల నాక్ (NAAC) నుంచి 3.23 సీజీపీఏతో ‘A’ గ్రేడ్ పొందడం గర్వకారణమన్నారు. ఈ విజయంతో జాతీయ స్థాయిలో మరింత ఉన్నత స్థానాలను సాధించే సామర్థ్యం విశ్వవిద్యాలయానికి ఉందని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ (PM-USHA) కింద రూ.20 కోట్ల నిధులు మంజూరుకావడం, డీప్ ఓషన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి రూ.4.12 కోట్ల గ్రాంట్ లభించడం విశ్వవిద్యాలయ అభివృద్ధికి కొత్త అవకాశాలను తెరిచిందన్నారు. ఈ నిధుల ద్వారా పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ విద్య-విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. చివరిగా పట్టభద్రులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు తమ జ్ఞానం, నైపుణ్యాలను సమాజ శ్రేయస్సు కోసం వినియోగించి దేశ అభివృద్ధికి తోడ్పడాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, ప్రశాంతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

