దేశానికి సేవ చేయడమే నా జీవిత లక్ష్యం-ప్రధాని మోదీ
అమరావతి: దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం అవకాశం లభించడం తన అదృష్టమని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యనించారు.ఎన్డీఏ కూటమి నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్బంలో నేతలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.
పాలన–దేశాభివృద్ధి:- అధికారాన్ని తాను ఒక సేవగా భావిస్తానని, దేశాభివృద్ధికి స్థిరమైన ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకున్నారని అన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజల్లో నమ్మకం పెరిగిందని,తాము తీసుకొచ్చిన పథకాల వల్ల వచ్చిన మార్పులను చూసి గర్వపడుతున్నామన్నారు. దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని తెలిపారు. 2014కు ముందు దేశంలో అనేక సమస్యలు ఉండేవని, ఆ తరువాత దేశ రూపురేఖల్లో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు.యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు మరింత కృషి చేస్తామని ప్రధాని చెప్పారు.
డిజిటల్ చెల్లింపుల్లో భారత్‌ను ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలిపామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తమ పాలసీలు ఉంటాయన్నారు. మేం కేవలం లెక్కలు మాత్రమే చెప్పడం లేదని, వాటిని ఆచరణలో చూపిస్తున్నామన్నారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే ఇలాంటి అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
కాంగ్రెస్ వైఫల్యాలపై విమర్శలు:- తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు సామాన్య ప్రజలు ఎంతో ఆనందించారని మోదీ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ విశ్వాసఘాతుకానికి పాల్పడిందని, గత 12 ఏళ్ల నుంచి దేశానికి కాంగ్రెస్ పీడ విరగడైందన్నారు. కాంగ్రెస్ చేసిన వైఫల్యాలను తాము సరిదిద్దుతున్నామని, అసలైన అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో అటల్ బిహారీ వాజ్‌పేయ్ చూపించారని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడిందని, ప్రస్తుతం ఎన్డీఏ పాలన అవినీతి రహితంగా సాగుతోందని మోదీ స్పష్టం చేశారు. గతంలో దశాబ్దాల కాలం పట్టిన అభివృద్ధి, ఇప్పుడు కేవలం నెలల వ్యవధిలోనే జరుగుతోందని తెలిపారు.
దేశ ప్రయోజనాలే ప్రథమం:- తనకు పార్టీ కంటే దేశ ప్రజలే ముఖ్యమని,‘నేషన్ ఫస్ట్’ నినాదంతో తాము పనిచేస్తున్నామని చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి, దేశ భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడబోమని నిరూపించామన్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని, దేశంలో మావోయిస్టులను అంతం చేశామని వెల్లడించారు. ట్రిపుల్ తలాఖ్ రద్దు చట్టాన్ని తీసుకురావడంతో పాటు, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించామని గుర్తుచేశారు.2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) మార్చడానికి మరింత వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
