పాత డంపర్ బిన్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయండి-కమిషనర్ సూర్య తేజ
నెల్లూరు: నగరవ్యాప్తంగా ఉన్న పాత డంపర్ బిన్స్ స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేసి పారిశుధ్య నిర్వహణ పనులను మెరుగుపరచాలని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం స్థానిక బట్వాడి పాలెం సెంటర్, వెహికల్ షెడ్, టీ.బి హాస్పిటల్ వెహికల్ షెడ్, బారా షహీద్ దర్గా తదితర ప్రాంతాల్లో పర్యటించారు.వెహికల్ షెడ్ లో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. టీబి హాస్పిటల్ వెహికల్ షెడ్ లో చెత్త తరలింపు వాహనాలను పరిశీలించారు. వాహనాలకు అవసరమైన పెయింటింగ్ పనులు, మరమ్మతులను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజు అన్ని డివిజన్లలో చెత్త సేకరణ వాహనాలు తిరిగే విధంగా పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. అవసరమైన అన్నిచోట్ల వాటిని వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం డి.ఈ.ఈ. రఘురాం, వార్డు సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.