AP&TGOTHERSSPORTS

అమరావతి ఛాంపియన్ షిప్-2026 – రాష్ట్ర స్థాయి క్రీడాఉత్సవాలు-జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

14,700 మంది క్రీడాకారులు, 1,000 మంది కోచ్‌లు..

ఆగస్టు 24న తారకరామ స్టేడియంలో ప్రారంభోత్సవం..

తిరుపతి: ఆగష్టు 24 నుండి 27 వరకు నిర్వహించనున్న అమరావతి ఛాంపియన్ షిప్-2026 – రాష్ట్ర స్థాయి క్రీడా మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పటిష్టంగా, సమన్వయంతో పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో అమరావతి ఛాంపియన్ షిప్-2026 ఏర్పాట్ల పై జిల్లా SP ఎల్. సుబ్బరాయుడు, SAAP చైర్మన్ రవినాయుడు,సంబందిత అధికారులతో కలసి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అమరావతి ఛాంపియన్ షిప్, క్రీడా కార్యక్రమం ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారన్నారు. ఈ పోటీలలో అర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్ మింటన్, బాస్కెట్ బాల్,బాక్సింగ్, చెస్,హాకీ, కబడ్డీ, ఖో ఖో, వాలీ బాల్, వెయిట్ లిఫ్టింగ్, యోగా పోటీలు నిర్వించనున్నారన్నారు.   రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన సుమారు 14,716 మంది క్రీడాకారులు, సుమారు 1,000 మంది కోచ్‌లు, అధికారులు తిరుపతికి రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి, భోజనం, రవాణా, క్రీడా మైదానాలు, వైద్య, పారిశుధ్య, భద్రత తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయి క్రీడా మహోత్సవానికి ముందుగానే ఆగస్టు 23వ తేదీ రాత్రికే క్రీడాకారులు తిరుపతికి చేరుకునేలా అవసరమైన రవాణా, వసతి ఏర్పాట్లు చేయాలని, ఆగస్టు 24వ తేదీ ఉదయం 8 గంటలకే క్రీడాకారులంతా తారకరామ స్టేడియంలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేరుకునేలా వసతి కేంద్రాల నుంచి రవాణా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సుమారు 14,700 మంది క్రీడాకారులు ఒకేసారి పాల్గొనే అవకాశం ఉన్నందున ప్రతి శాఖ తనకు అప్పగించిన బాధ్యతలను స్పష్టంగా నిర్వర్తిస్తూ, ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రతిరోజూ సమీక్షిస్తూ, ఎక్కడా లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

మహిళా క్రీడాకారులకు:- శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మహిళా క్రీడాకారులకు అవసరమైన వసతి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో వారి విద్యకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అందుబాటులో ఉన్న గెస్ట్‌ హౌస్‌లు, ఇతర గదులను వినియోగించుకుని కనీసం 400 మందికి పైగా వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

SAAP చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్–2026 పోటీలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు కల్పించి, పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి శాఖ సహకరించాలని కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *