యూనిఫాం గౌరవాన్ని,బాధ్యతను పెంచుతుంది-మంత్రి నారాయణ
పోలీసు విధుల్లో నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావం..
నెల్లూరు: పోలీసు యూనిఫాం కేవలం ఉద్యోగానికి గుర్తింపు కాదని,అది ప్రజల నమ్మకానికి, ప్రభుత్వ బాధ్యతకు, క్రమశిక్షణకు, సేవాభావానికి ప్రతీక అని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని 9వ బెటాలియన్‌లో నిర్వహించిన 2026 బ్యాచ్ APSP పాసింగ్ అవుట్ పరేడ్‌లో మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన 231 మంది SCTPCలను అభినందించారు. మంత్రి నారాయణకు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ,9వ బెటాలియన్ కమాండెంట్ రామచంద్రమూర్తి ఘన స్వాగతం పలికారు. పరేడ్‌ను తిలకించిన మంత్రి ,శిక్షణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 9వ బెటాలియన్ నిర్వహించిన APSP పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పోలీసు శాఖలో సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైన SCTPCలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు వారి జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్‌కు రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ప్రత్యేకమైన స్థానం ఉందని మంత్రి తెలిపారు. శిక్షణలో ప్రావీణ్యం పొంది, ప్రజా సేవ పట్ల బాధ్యతతో కూడిన పోలీసు సిబ్బందిగా వారు విధుల్లోకి అడుగుపెడుతున్నారని అన్నారు.
సేవా జీవితానికి ఐదు సూత్రాలు :- పోలీసు సిబ్బంది తమ సేవా జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలను మంత్రి నారాయణ సూచించారు.
- క్రమశిక్షణను ఎప్పుడూ వదులుకోవద్దు.
- ఎవరూ చూడని సమయంలో కూడా నిజాయితీగా ఉండాలి.
- కష్టమైన పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడాలి.
- ప్రజల బాధను అర్థం చేసుకుని మానవతా దృక్పథంతో స్పందించాలి.
- సహచరులతో కలిసి సమిష్టిగా పనిచేయాలి.
ఈ ఐదు విలువలను జీవితంలో పాటిస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలరని మంత్రి నారాయణ ఆకాంక్షించారు.

