807 ఏ4 మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా కేటాయింపు-ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్
అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ..
అక్టోబర్ 5న ఉదయం 8 గంటలకు డ్రా..
అమరావతి, సెప్టెంబరు 25: రాష్ట్రంలో 2026–27 ఎక్సైజ్ పాలసీ ప్రకారం 807 ఏ4 మద్యం దుకాణాలను డ్రా ఆఫ్ లాట్స్ ద్వారా కేటాయించేందుకు ప్రక్రియ కొనసాగుతోందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. సెప్టెంబరు 24న జిల్లా గెజిట్లలో దుకాణాల వివరాలను ప్రచురించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించామని, అక్టోబర్ 1 అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా తాజా కేటాయింపుల కోసం 807 ఏ4 దుకాణాలను గుర్తించగా, వీటిలో 799 ఓపెన్ కేటగిరీ, 8 రిజర్వుడ్ కేటగిరీ దుకాణాలు ఉన్నాయి. పునరుద్ధరణ జరగని లేదా ప్రస్తుతం పనిచేయని దుకాణాల స్థానంలో ఆయా యూనిట్లకు తాజా దరఖాస్తులను స్వీకరించి డ్రా ద్వారా లైసెన్సులు మంజూరు చేయనున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.
ఎన్ని దరఖాస్తులైనా సమర్పించవచ్చు: 21 సంవత్సరాలు పైబడిన, నిబంధనల ప్రకారం అనర్హత లేని వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఒక్కో దుకాణానికి ఎన్ని దరఖాస్తులైనా సమర్పించవచ్చని తెలిపారు. దరఖాస్తుదారులు ఏపీ ఎక్సైజ్ చట్టం–1968, ఏపీ ఎక్సైజ్ (గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ ఆఫ్ సెల్లింగ్ బై షాప్ అండ్ కండిషన్స్ ఆఫ్ లైసెన్స్) రూల్స్–2024, 2026–27 ఎక్సైజ్ పాలసీ, నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్రిఫండబుల్ అప్లికేషన్ ఫీజుతో పాటు రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఆన్లైన్, హైబ్రిడ్ లేదా ఆఫ్లైన్ విధానాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఒక్కో ఏ4 దుకాణానికి కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చినప్పుడే డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహిస్తారు. నాలుగు దరఖాస్తులు రాకపోతే ఆయా దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ గడువును కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆదేశాల మేరకు పొడిగించే అవకాశం ఉంటుంది. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన దుకాణాలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అక్టోబర్ 5న ఉదయం 8 గంటలకు డ్రా నిర్వహిస్తారు. దరఖాస్తుదారులు హాజరైనా, హాజరు కాకపోయినా డ్రా ప్రక్రియ కొనసాగుతుంది.
ఎంపికైన వారికి అక్టోబర్ 5న సమాచారం అందిస్తారు. ఎంపికైన దరఖాస్తుదారులు అన్ని చట్టపరమైన, నియంత్రణ పరమైన నిబంధనలను పూర్తి చేసిన అనంతరం ఫారం–ఏ4 లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. సవరించిన రూల్–14 ప్రకారం దుకాణం ఏర్పాటు చేసి నిర్వహించేందుకు పెర్మిట్ రూమ్ లైసెన్స్ పొందడం తప్పనిసరి.
వార్షిక రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఆర్ఈటీ)ను ఒకేసారి లేదా నాలుగు సమాన వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉంటుంది. వాయిదా విధానాన్ని ఎంచుకునే వారు ఎంపికైన రోజున లేదా తదుపరి బ్యాంకు పనిదినంలో తొలి వాయిదా చెల్లించాల్సి ఉంటుంది.
జిల్లాల వారీగా కేటాయించనున్న ఏ4 దుకాణాలు: శ్రీకాకుళం 39, విజయనగరం 30, పార్వతీపురం మన్యం 9, విశాఖపట్నం 52, అనకాపల్లి 39, అల్లూరి సీతారామరాజు 3, కాకినాడ 38, కోనసీమ 12, తూర్పుగోదావరి 4, పోలవరం 1, ఏలూరు 19, పశ్చిమగోదావరి 25, కృష్ణా 35, ఎన్టీఆర్ 18, గుంటూరు 49, పల్నాడు 24, బాపట్ల 34, ప్రకాశం 45, మార్కాపురం 21, ఎస్పీఎస్ నెల్లూరు 51, చిత్తూరు 19, తిరుపతి 49, కర్నూలు 17, నంద్యాల 27, అనంతపురము 53, శ్రీ సత్యసాయి 17, అన్నమయ్య 17, వైఎస్సార్ కడప 60 దుకాణాలు. వీటిలో చిత్తూరు జిల్లాలో ఒకటి, నంద్యాలలో ఒకటి, అనంతపురములో మూడు, వైఎస్సార్ కడప జిల్లాలో మూడు రిజర్వుడ్ కేటగిరీ దుకాణాలు ఉన్నాయి. మిగిలిన 799 దుకాణాలు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి.
దరఖాస్తుదారులు జిల్లా గెజిట్ నోటిఫికేషన్లోని దుకాణాల వివరాలు, అర్హత నిబంధనలు, దరఖాస్తు విధానం, ఫీజులు, అవసరమైన పత్రాలు, గడువులను పూర్తిగా పరిశీలించిన అనంతరం దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ చామకూరి శ్రీధర్ సూచించారు

