AP&TGDISTRICTS

నవాబుపేట మార్కెట్ యార్డులో రూ.60 కోట్లతో ఆధునిక మార్కెట్‌-మంత్రి నారాయణ

నెల్లూరులో రూ.3,500 కోట్లతో అభివృద్ధి పనులు..

ప్రభుత్వ స్కూల్స్ లో స్విమ్మింగ్ పూల్స్..

అసత్య ఆరోపణలను పట్టించుకోను..

నెల్లూరు: నెల్లూరు నగరంలో రూ.3,500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నగర సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, మార్కెట్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన తదితర పనులను వేగంగా చేపడుతున్నామని చెప్పారు.

ఆదివారం నెల్లూరు నగరంలోని వివిధ డివిజన్లలో మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 9వ డివిజన్ నవాబుపేటలో రూ.60 కోట్లతో నిర్మించనున్న ఆధునిక మార్కెట్ పనులకు కూడా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2028 జూన్ 12 నాటికి నెల్లూరు నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 12లోపు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాలను పూర్తి చేస్తామని చెప్పారు.నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

నవాబుపేట మార్కెట్ యార్డులో రూ.60 కోట్లతో ఆధునిక మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. తొలిదశలో రూ.13 కోట్లతో పనులు ప్రారంభిస్తామని, వ్యాపారులతో చర్చించి వారికి అనుకూలంగా నిర్మాణాలను చేపడతామని చెప్పారు.

ప్రభుత్వ స్కూల్స్ లో స్విమ్మింగ్ పూల్స్:- నగరంలోని ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులతో పాటు స్విమ్మింగ్ పూల్స్ వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు ముఖ్యమంత్రి రూ.50 వేల కోట్ల నిధులు అందించారని తెలిపారు.

అసత్య ఆరోపణలను పట్టించుకోను:- నెల్లూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేక చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. అసత్య ఆరోపణలతో తనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని, వారి విమర్శలను ప్రజలు విశ్వసించరని చెప్పారు. తాను కూడా వాటిని పట్టించుకోనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, అసిస్టెంట్ కమిషనర్ రేష్మా, కార్పొరేషన్ ఈఈ అనీల్ కుమార్, డీఈ శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *