వైసీపీ ఐదేళ్ల కంటే.. ఈ రెండేళ్లలోనే పదింతల రోడ్ల నిర్మాణం
100 రెట్లు ఎక్కువగా మినీ గోకులాలు..
అడవి తల్లిబాటలో 1,500 కి.మీ.కు పైగా రహదారుల నిర్మాణం..
గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ 3.0..
పల్లె పండుగ 3.0లో 6 వేల కి.మీ. సీసీ రోడ్లు, 9,500 కి.మీ. బీటీ రోడ్లు..
కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ అభివృద్ధికి భారీ కార్యాచరణ..
ఉదయగిరి వేదికగా రూ.11,085 కోట్ల పల్లెపండుగ 3.0కు శ్రీకారం..
ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పనులు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
నెల్లూరు: ‘పల్లెల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాది. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడేలా, ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించేలా సమగ్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రహదారులు, తాగు నీరు, వ్యవసాయం, ఉపాధి, పరిశుభ్రత, మౌలిక వసతులతోపాటు పర్యాటక రంగానికీ ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో ‘పల్లె పండుగ 3.0’కు శ్రీకారం చుట్టామ’ని ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,బిజెపీ రాష్ట్ర అధ్యక్షడు మాధవ్ లు తెలిపారు. పల్లె బలపడితేనే రాష్ట్ర భవిష్యత్తు బలపడుతుందనే సంకల్పంతో ప్రతి పల్లెను అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పల్లెపండుగ 3.0 కార్యక్రమం ద్వారా 11,085 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి నుంచి:- ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఈ రెండున్నరేళ్లలో పల్లెపండుగ, జలజీవన్ మిషన్ – అమరజీవి జలధార, 15వ ఆర్థిక సంఘం నిధుల సద్వినియోగం, 10 వేలకుపైగా పదోన్నతులు, డి.డి.ఒ. కార్యాలయాల ఏర్పాటు.. ఇలా ఎన్నో సంస్కరణలతో ఒకవైపు గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తూనే, మరోవైపు వ్యవస్థను బలోపేతం చేశాం. ఒకప్పుడు పంచాయతీలు బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి నుంచి, ఇప్పుడు తమ గ్రామానికి అవసరమైన పనులను తామే నిర్ణయించుకుని, తమ గ్రామ అభివృద్ధికి తామే ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీ రాజ్ వ్యవస్థను తీసుకొచ్చాం.
గత ఐదేళ్ల కంటే రెండేళ్లలోనే పదింతల రోడ్ల నిర్మాణం:- గత ప్రభుత్వం ఐదేళ్లలో 880 కి.మీ. సీసీ రోడ్లు నిర్మిస్తే, కూటమి ప్రభుత్వం ద్వారా కేవలం రెండేళ్లలోనే దానికి 10 రెట్లు ఎక్కువగా, దాదాపు 9,000 కి.మీ. సీసీ రోడ్లను పూర్తి చేశాం. గతంలో 304 మినీ గోకులాలు మాత్రమే నిర్మిస్తే, మనం దాదాపు 100 రెట్లు ఎక్కువగా, 30 వేలకు పైగా మినీ గోకులాలను నిర్మించాం. అలాగే, పల్లెపండుగ ద్వారా 13,326 గ్రామ పంచాయతీల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాం. ఇందులో భాగంగా 1 లక్ష 15 వేల పంట కుంటలను నిర్మించడంతోపాటు, 2 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేశాం. మరోవైపు, 10 వేల కిలోమీటర్ల బీటీ రోడ్ల పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.
పల్లెపండుగ 3.0తో గ్రామీణ ప్రగతికి కొత్త ఊపు:- ఈ రోజు ఇక్కడ మనం రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గ్రామీణ అభివృద్ధిని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లబోతున్నాం. రూ.50 వేల కోట్లతో పల్లెపండుగ, జల జీవన్ మిషన్ – అమరజీవి జలధార వంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయబోతున్నాం.
పైలెట్ ప్రాజెక్ట్ గా డొంక రోడ్ల అభివృద్ధి:- ఎన్నో ఏళ్లుగా రైతులు తమ పంటలను మార్కెట్కు తరలించేందుకు డొంక రోడ్ల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముందుగా పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రతి నియోజకవర్గంలో ఒక డొంక రోడ్డును అభివృద్ధి చేయబోతున్నాం. ఆ తర్వాత 161 గ్రామీణ నియోజకవర్గాల్లో డొంక రోడ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి, రైతులు తమ పంటలను సులభంగా మార్కెట్కు తీసుకెళ్లేలా రహదారి సౌకర్యాన్ని మెరుగుపరచబోతున్నాం.
ఉదయగిరి ఇక అభివృద్ధి బాటలో:- నెల్లూరు జిల్లాలోనే దాదాపు రూ.520 కోట్లతో పల్లెపండుగ పనులు చేపట్టాం. ఇంకా మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టబోతున్నాం. మన ఉదయగిరిలోనే పల్లెపండుగ ద్వారా రూ.121 కోట్లతో 115 కి.మీ. మేర సీసీ, బీటీ రోడ్లు, 1,200కు పైగా నీటి కుంటలు, 348 గోకులాలు, 190కి పైగా నీటి తొట్లు, సుమారు 900 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు వంటి అభివృద్ధి పనులను పూర్తి చేశాం అన్నారు.

