మిలిటరీ కదిలికల కోసం నేషనల్ హైవేపై సీసీటీవీ కెమెరాను అమర్చిన బిట్టు అరెస్ట్
అమరావతి: పంజాబ్ లోని పఠాన్‌కోట్‌లో పోలీసులు గూఢచర్యం కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ, పారామిలిటరీ దళాల కదిలికలకు చెందిన అత్యంత సున్నిత సమచారాన్ని అతను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు గుర్తించారు. బల్జిత్ సింగ్ అలియాస్ బిట్టు ఈ ద్రోహంకు పాల్పడినట్లు గుర్తించారు.అతని స్వగ్రామం చాక్ ధరివాల్ . పఠాన్‌కోట్- జమ్మూ నేషనల్ హైవే 44 మార్గంలో ఓ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న షాపు వద్ద నిందితుడు సీసీటీవీ కెమెరాను ఇన్‌స్టాల్ చేశాడు. ఆర్మీ, పారామిలిటరీ దళాల కదలికలపై శత్రు దేశాలకు చేరవేసేందుకు సదరు కెమెరా అమర్చినట్లు పోలీసులు కనుగొన్నారు.
నెలకు రూ.40 వేలు:- నిఘాకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్‌తో పాటు ఇతర దేశాల్లో ఉన్న వారికి సమాచారాన్ని,,ఎలక్ట్రానిక్ పద్ధతిలో సీసీటీవీ ఫూటేజ్‌ను పాకిస్థాన్‌కు చేరినట్లు పోలీసు ఆఫీసర్ దల్జీందర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. దుబాయ్‌లో ఉన్న ఓ వ్యక్తి నుంచి అతనికి ఆదేశాలు వచ్చేవని, అతను నెలకు రూ.40 వేలు ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు. సీసీటీవీ కెమెరాతో పాటు ఇంటర్నెట్ వైఫై రౌటర్ అతని వద్ద నుంచి రికవరీ చేశారు. పాక్ ఐఎస్ఐ గూఢచర్యంకు పాల్పడినట్లు పంజాబ్ పోలీసులు ఆరోపిస్తున్నారు. చైనాకు చెందిన సీసీటీవీ కెమెరాలతో సున్నిత ప్రదేశాలకు చెందిన లైవ్ ఫీడ్‌ను పాక్‌కు చేరవేస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులోనే బిట్టుతో పాటు విక్రమ్‌జిత్ సింగ్, బల్విందర్ సింగ్, తరణ్‌ప్రీత్ సింగ్ అనే మరో ముగ్గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు నేరపూరిత, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు.

