AP&TGHEALTHOTHERS

మందుల లభ్యత గురించే ప్రజలే నేరుగా తెలుసుకునేలా ‘క్యూ’ఆర్ కోడ్-మంత్రి సత్య కుమార్

రాష్ట్ర ఇ-ఔషధి కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ..

అమరావతి: ప్రభుత్వాసుపత్రులకు మందుల సరఫరా, వినియోగ విధానంలో సమూల మార్పులు రాబోతున్నాయి.  ప్రజలే నేరుగా సదరు ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న మందుల లభ్యత గురించి ‘క్యూఆర్’ కోడ్ ద్వార తెలుసుకునే విధానాన్ని తీసుకువచ్చే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అలాగే మందుల వ్యవహారంలో ప్రతి ప్రక్రియ ఆన్లైన్లో నమోదు జరిగేలా, సంబంధిత పర్యవేక్షణ అధికారులకు సంక్షిప్త సందేశాల రూపంలో ‘అలర్ట్’ వెళ్లే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. ఈ మేరకు రాష్ట్రoలో 2014 నుంచి వినియోగిస్తున్న ‘ఇ-ఔషధి’ వ్యవస్థను పటిష్టం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన కీలక సమావేశం మంగళగిరిలోని రాష్ట్ర వైద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగింది. మంత్రి సత్య కుమార్ చొరవతో ఢిల్లీ నుంచి వచ్చిన సీ-డాక్ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో:- రాష్ట్ర వైద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా జరిగే కొనుగోళ్లకు అనుగుణంగా ప్రభుత్వాసుపత్రులకు మందుల సరఫరా ‘ఇ-ఔషధి’ (సాఫ్ట్వేర్) అప్లికేషన్ ఆధారంగా జరుగుతోంది. ప్రతి ఏటా  మందులు సర్జికల్ కొనుగోళ్ల కోసం  ప్రతి ఏటా సుమారు రూ.800 కోట్ల వరకు ప్రభుత్వం వ్యయం చేస్తుంది. ఇందులో రూ.600 కోట్ల విలువైన మందులను ప్రభుత్వం ఉచితంగా పేద రోగుల కోసం ప్రభుత్వాసుత్రులకు సరఫరా చేస్తోంది.

కీలక మార్పులు:- సదరు ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న మందుల నిల్వల గురించి అక్కడి పనిచేసే ఫార్మసిస్టులు, మెడికల్ ఆఫీసర్లు మాత్రమే కాకుండా ప్రజలు కూడా ‘క్యూ ‘ఆర్’ కోడ్ ద్వారా నేరుగా తెలుసుకునే సదుపాయాన్ని కల్పిస్తారు.

ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల (ఉప ఆరోగ్య కేంద్రాలు) నుంచి బోధనాసుపత్రుల వరకు సదరు ఆసుపత్రుల్లో మందుల నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయో ఎవరైనా తెలుసుకునే విధంగా ‘డ్యాష్ బోర్డు’ను తయారు చేస్తారు.

మందుల తయారీదారులు, పంపిణీదారులు టెండర్లలో ఒప్పుకున్న ప్రకారం మందులను ప్రభుత్వాసుత్రులకు తగిన సమయంలో పంపుతున్నారా? లేదా? అన్న వివరాలను రియల్ టైమ్ విధానంలో గమనించేలా ‘ఇ-ఔషధి’ వ్యవస్థను పటిష్టం చేయనున్నారు.

ఆయుష్ (ఆయుర్వేద, హోమియో, యూనాని) మందుల సరఫరా విధానాన్ని ఇ-ఔషధి పరిధిలోనికి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు.

మనమిత్ర యాప్ లోనూ ప్రతి మందు నిల్వ గురించి తెలుసుకునే సదుపాయాన్ని కల్పించబోతున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *