అబుదాబి అణు విద్యుత్ కేంద్రం సమీపంలో డ్రోన్ దాడి
అమరావతి ఇజ్రాయిల్-అమెరికా-ఇరాన్ ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటన్నాయి.ఇలాంటి సమయంలో UAEలోని బరాకా అణు విద్యుత్ కేంద్రం సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా ప్లాంట్ ఆవరణలో ఉన్న ఎలక్ట్రికల్ జనరేటర్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ విషయమై అబుదాబి అధికారిక మీడియా కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. డ్రోన్ దాడి కారణంగా చెలరేగిన మంటలు అణు ప్లాంట్ వెలుపల వరకు మాత్రమే పరిమితమయ్యాయని వెల్లడించింది. డ్రోన్ దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపింది. ప్లాంట్ లోపల ఉండే ప్రధాన అణు రియాక్టర్లకు ఎలాంటి నష్టం జరగలేదని, రేడియేషన్ సమస్య కూడా తలెత్తలేదని పేర్కొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని తెలిపింది.
20 బిలియన్ డాలర్ల బరకా అణు విద్యుత్ కేంద్రాన్ని UAE, దక్షిణ కొరియా సహాయంతో నిర్మించింది. 2020లో అణు విద్యుత్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించింది. ఇది అరబ్ ప్రపంచంలోనే మొట్టమొదటి,ఏకైక అణు విద్యుత్ కేంద్రం. ఏడు ఎమిరేట్స్ అయిన యూఏఈ మొత్తం ఇంధన అవసరాలలో నాలుగో వంతును ఇది అందిస్తుంది.

