జీఎస్టీ అధికారులకు ఉన్న అరెస్ట్ అధికారాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం
కనీస శిక్ష అనే నిబంధనను GST చట్టం నుంచి తొలగిస్తున్నట్లు..
సాధారణ జరిమానాను 25 వేల నుంచి 10 వేలకు..
క్యాన్సర్ ఔషధాల మార్జిన్లపై పరిమితి..
అమరావతి: దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేస్తూ, జీఎస్టీ అధికారులకు ఉన్న అరెస్ట్ అధికారాలను రద్దు చేస్తూ దిశగా GST కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన గురువారం జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను చెల్లింపుదారులకు పెద్దపీట వేస్తూ పలు సంస్కరణలకు ఆమోదం తెలిపారు. ఈ విధానం ప్రకారం.. నిర్దిష్ట సమాచార ఆధారంగా మాత్రమే సరకులను నిలిపి తనిఖీ చేయాల్సి ఉంటుంది. దీంతో జీఎస్టీ అధికారులు యథేచ్ఛగా వాహనాలను ఆపి చెక్ చేసే అవకాశం ఇకపై ఉండదు. సరకుల స్వాధీనం కూడా సరఫరా జరిగే రాష్ట్రం లేదా సరకు చేరే రాష్ట్రానికి చెందిన అధికారులు మాత్రమే చేపట్టేలా నిబంధనలను మార్చాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది.
కనీస శిక్ష అనే నిబంధనను GST చట్టం నుంచి తొలగిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. జరిమానా, జైలు శిక్ష లేదా రెండూ అనే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థానాల విచక్షణాధికారానికే వదిలేసినట్లు తెలిపారు. సాధారణ జరిమానాను 25 వేల నుంచి 10 వేలకు తగ్గిస్తూ GST మండలి నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 10 వేల రూపాయల కంటే తక్కువ ఉన్న పన్నులకు ఎలాంటి డిమాండ్ నోటీసులు పంపబోరని పేర్కొన్నారు. ఇది మొత్తం కేసుల్లో దాదాపు 20 శాతం వరకు భారం తగ్గిస్తుంది. ట్యాక్స్ రేట్లలో మార్పులను ఇకపై ఏడాదికి ఒకసారే, అది కూడా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే అమలు చేసేలా ప్రతిపాదనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
జరిమానాను రూ.25 వేల నుంచి రూ.10 వేలకు:- ఇ-కామర్స్ ప్లాట్ఫాంలో ఉత్పత్తులను విక్రయించుకునే చిన్న వ్యాపారులకు ఊరటనిచ్చేలా నిబంధనలను సులభతరం చేసేందుకు GST మండలి ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఇ-కామర్స్ లో విక్రయించే చిరు వ్యాపారుల రిజిస్ట్రేషన్ మెకానిజాన్ని సులభతరం చేశారు. సాధారణ జరిమానాను రూ.25 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించారు.
క్యాన్సర్ ఔషధాల మార్జిన్లపై పరిమితి:- మరోవైపు క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ నిరోధక ఔషధాల ఎంఆర్పీపై వాణిజ్య మార్జిన్లు 30 శాతానికి పరిమితం చేస్తూ నిర్ణయించింది. బ్రాండెడ్, జెనెరిక్, దేశీయంగా ఉత్పత్తి చేసినవి, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి, పేటెంట్ ఉన్నవి, పేటెంట్ లేనివి ఇలా అన్ని రకాల క్యాన్సర్ మందులకూ ఈ నిబంధన వర్తిస్తుందని అధికారు వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం అమలుతో 35 పేటెంటెడ్ ఔషధాలతో సహా మొత్తం 110 రకాల క్యాన్సర్ మందుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. తద్వారా క్యాన్సర్ బాధిత కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది.

