తిరుపతి ఎకనామిక్ రీజియన్ ప్లానింగ్ కోసం ప్రత్యేక అడ్వైజరీ టీమ్‌ను ఏర్పాటు-ముఖేష్ కుమార్ మీనా
జాతీయ రహదారుల వెంట మౌలిక వసతులు..
ఒక జిల్లా మరొక జిల్లాకు సహకరిస్తూ..
తిరుపతి: తిరుపతి ఆర్ధిక ప్రాంత ప్రణాళిక – 2047 పై సదస్సు అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తిరుపతి ఎకనామిక్ రీజియన్ సి ఈ ఓ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. తిరుపతి ఎకనామిక్ రీజియన్‌లోని తొమ్మిది జిల్లాలు రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 50 శాతం ప్రాంతాన్ని కలిగి ఉన్నప్పటికీ, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP)లో సుమారు 34 శాతం వాటాను కలిగి ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రీజియన్ ఆర్థిక వృద్ధికి మరింత అవకాశం ఉన్న రంగాలను గుర్తించి, ప్రతి రంగం, సబ్-సెక్టార్ వారీగా GVA కాంట్రిబ్యూషన్, వృద్ధికి దోహదపడే అంశాలు, అవసరమైన విధానపరమైన చర్యలను సమగ్రంగా విశ్లేషిస్తున్నామని తెలిపారు. ప్రతి రంగానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమి, భవిష్యత్ అవసరాలకు కావాల్సిన ల్యాండ్ పార్సల్స్, పెట్టుబడి అవసరాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, గ్రాంట్లు, రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు, పబ్లిక్–ప్రైవేట్ పార్ట్ నర్‌షిప్ (PPP), వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వంటి వివిధ నిధుల వనరులను అనుసంధానం చేస్తూ సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నామని వివరించారు.తిరుపతి ఎకనామిక్ రీజియన్ ప్లానింగ్ కోసం CEOతో పాటు ప్రత్యేక అడ్వైజరీ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ టీమ్‌లో IIT తిరుపతి డైరెక్టర్, IIM బెంగళూరుకు చెందిన సీనియర్ ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడకు చెందిన సీనియర్ డైరెక్టర్‌తో పాటు నాలెడ్జ్ పార్ట్ నర్ సంస్థల నిపుణుల సూచనలు కూడా తీసుకుంటున్నామని అన్నారు.
జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. మొత్తం TER రీజియన్‌లో తిరుపతి ఒక ప్రధాన ఆర్థిక, పర్యాటక కార్యకలాపాల కేంద్రంగా ఉందని ఈ ప్రాంత అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ఒక సమగ్ర, స్ట్రక్చర్డ్ ప్లానింగ్‌తో భవిష్యత్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జిల్లా వారీగా సమావేశాలు నిర్వహించారని తెలిపారు.
జాతీయ రహదారుల వెంట మౌలిక వసతులు:- తిరుపతికి అనుసంధానమయ్యే ప్రధాన జాతీయ రహదారుల వెంట అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను మరింత విస్తరించవచ్చని, ఈ మార్గాల్లో వాణిజ్య, పర్యాటక, లాజిస్టిక్స్, సర్వీస్-ఆధారిత మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి, జీడీపీ పెరుగుదలకు అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు.
14 జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రీమియర్ విద్యా సంస్థలు:- తిరుపతి జిల్లాలో సుమారు 14 జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రీమియర్ విద్యా సంస్థలు ఉన్నాయన్నారు. ఒకవైపు ఉన్నత విద్యా సంస్థలు, మరోవైపు పరిశ్రమలు ఉన్నప్పటికీ వీటి మధ్య నైపుణ్యాలు, ఉపాధి అవసరాలకు సంబంధించిన డిమాండ్-సప్లై గ్యాప్ ఉందని, ఈ గ్యాప్‌ను తగ్గించి, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ ను తయారు చేయడం, స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించడం కూడా ఈ ప్రణాళికలో కీలక అంశమన్నారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా:- మాట్లాడుతూ ఈరోజు జరిగిన సమావేశం ఎంతో ఫలప్రదంగా జరిగింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలను పరిపాలనా పరంగా మూడు వేర్వేరు జిల్లాలుగా ఉన్నప్పటికీ, అభివృద్ధి పరంగా ఒకే ప్రాంతంగా భావించి సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ మూడు జిల్లాలకు చెందిన కలెక్టర్లు పాల్గొని వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించామన్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్న పోర్టు కేవలం నెల్లూరు జిల్లాకు మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఉపయోగపడే గేట్‌వేగా పనిచేస్తుందన్నారు.
ఒక జిల్లా మరొక జిల్లాకు సహకరిస్తూ:- కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన పరిశ్రమలు, వ్యాపార సంస్థలు కూడా ఈ మౌలిక సదుపాయాలను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. కాబట్టి అందుబాటులో ఉన్న వనరులు, మౌలిక సదుపాయాలను సమన్వయంతో ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ఈరోజు చర్చ జరిగిందన్నారు. నీటి విషయంలో కూడా శ్రీశైలం, సోమశిల, కండలేరు తదితర ప్రాజెక్టుల ద్వారా అందుబాటులో ఉన్న నీటి వనరులను సమన్వయంతో వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక జిల్లా మరొక జిల్లాకు సహకరిస్తూ, ఒకే దిశలో ముందుకు సాగితేనే ప్రభుత్వం నిర్దేశించిన 15 శాతం వృద్ధి లక్ష్యాన్ని సాధించగలుగుతామని తెలిపారు.

