శ్రీసిటీలోని ‘టాబ్లెట్స్ ఇండియా లిమిటెడ్’లో బాయిలర్ పేలుడు-ఐదుగురు మృతి-కలెక్టర్ వెంకటేశ్వర్
బాధితులకు ఒక్కొకరికి రూ.50 లక్షల నష్ట పరిహారం. .
ప్రమాద ఘటన పై విచారణకు ఆదేశం..
శ్రీసిటీలో ఇటువంటి ప్రమాదం జరగడం ఇదే తొలిసారి..
తిరుపతి: శ్రీసిటీ పరిధిలోని ‘టాబ్లెట్స్ ఇండియా లిమిటెడ్’ (TIL) పరిశ్రమలో శనివారం ఉదయం సుమారు 8:30 గంటల ప్రాంతంలో ఆకస్మిక పేలుడు సంభవించడంతో దురదృష్టవశాత్తు 5 మంది మరణించారని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
2 టన్నుల సామర్థ్యం గల బాయిలర్:- శ్రీ సిటీ పరిధిలో గల విదేశీ ఎగుమతులు చేపట్టే ఔషధాల తయారీ పరిశ్రమలోని 2 టన్నుల సామర్థ్యం గల బాయిలర్ ఆకస్మికంగా పేలిపోవడంతో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. పేలుడు ధాటికి బాయిలర్ వద్ద పనిచేస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, ఎగసిపడిన శిథిలాలు తగలడంతో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక బాయిలర్ ఆపరేటర్, ఇద్దరు ఈటీపీ సిబ్బందితో పాటు మరో ఇద్దరు కార్మికులు ఉన్నారన్నారు. మరణించిన వారిలో ఒకరు కోల్కతా, ఇద్దరు తమిళనాడు, మరో ఇద్దరు స్థానికంగా చెర్వి, తడ ప్రాంతాలకు చెందినవారన్నారు. ప్రమాదంలో మరెవరికీ గాయాలు కాలేదన్నారు.
ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున పరిహారం:- మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని, దహన సంస్కారాల కోసం శ్రీసిటీ యజమాన్యం తగిన ఏర్పాట్లు చేస్తోందని అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున పరిహారం రాబోయే 2 రోజుల్లో అందజేయడం జరుగుతుందన్నారు. మృతుల పిల్లల ఉన్నత చదువులతో సహా అన్ని విద్యా ఖర్చులను శ్రీసిటీ యాజమాన్యమే భరిస్తుందన్నారు. అర్హులైన కుటుంబ సభ్యులకు శ్రీసిటీ లేదా పరిసర పరిశ్రమల్లో తక్షణమే ఉద్యోగావకాశం కల్పిస్తారన్నారు. బాధ్యులపై ప్రిలిమినరీ కేస్ నమోదు చేయడంతో పాటు బాయిలర్, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్- పోలీస్ శాఖల ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు.
నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు:- సాంకేతిక విచారణ అనంతరం నిర్లక్ష్యానికి కారణమైన వారిపై తగిన కఠిన చర్యలు తీసుకుంటారన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన తిరుపతి బాయిలర్ ఇన్స్పెక్టర్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. గత 18 ఏళ్లలో శ్రీసిటీలో ఇటువంటి ప్రమాదం జరగడం ఇదే తొలిసారని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి శ్రీసిటీలోని అన్ని పరిశ్రమల్లో వెంటనే థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు.

