చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు వద్ద అండర్‌పాస్,సర్వీస్ రోడ్డు-శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ,ఎమ్మెల్యే
ఆరు లేన్ల అండర్‌పాస్, సర్వీస్ రోడ్డు..
ప్రారంభించిన తేదీ నుంచి 15 నెలల్లో పూర్తి..
నెల్లూరు: చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డులో ఏళ్ల తరబడి ప్రజలను భయపెడుతున్న ప్రమాదాల ముప్పునకు తెరపడనుంది. హైవే దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితికి త్వరలోనే పరిష్కారం లభించనుంది. నెల్లూరు బైపాస్‌లోని చింతారెడ్డిపాళెం జంక్షన్ సమీపంలో రూ.115.27 కోట్లతో ఆరు లేన్ల అండర్‌పాస్, సర్వీస్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు కలసి శంకుస్థాపన చేశారు.
15 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది:- చింతారెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.నాలుగు గ్రామాల ప్రజలతో పాటు ఆసుపత్రులకు వెళ్లే రోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయాలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి సమస్య పరిష్కారానికి కృషి చేశామని చెప్పారు.ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సహకారంతో అండర్‌పాస్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు సాధించామని మంత్రి వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియను సైతం పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమం చేశామని తెలిపారు. EPC విధానంలో పీటీఆర్ బ్రదర్స్ ప్రాజెక్ట్స్ సంస్థ నిర్మాణ పనులు చేపట్టనుందని, పనులు ప్రారంభించిన తేదీ నుంచి 15 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

