22 మంది కార్పొరేషన్ అడ్మిన్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, ఇంచార్జ్ అడ్మిన్ కార్యదర్శులు 22 మందికి రెవిన్యూ వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో కమిషనర్ సూర్య తేజ షోకాజ్ నోటీసులను శుక్రవారం జారీ చేశారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలతో మార్చి చివరి నాటికి ప్రస్తుత సంవత్సరం వసూళ్లూ 100%, పాత బాకాయిలు 75% పూర్తి చేయాలని నిర్దేశించారని తెలిపారు. అయితే ఈనెల 6వ తేదీన సూచించిన అడ్మిన్ కార్యదర్శులు జీరో వసూళ్లను చేయడంతో వారందరికీ షోకాజు నోటీసులు జారీ చేశామన్నారు. అలాగే నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో కొందరు అడ్మిన్ కార్యదర్శులు నిర్లక్ష్యం కనబరుస్తున్నారని, ఈనెల చివరి నాటికి 100% లక్ష్యాలను పూర్తి చేయడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరు విధులు నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. షోకాజ్ నోటీసులు అందుకున్న అడ్మిన్ కార్యదర్శులు రాతపూర్వకంగా వివరణ తెలియజేయాలని కమిషనర్ ఆదేశించారు.