RBI 90వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆన్‌లైన్ క్విజ్ పోటీలు-కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి: ఆర్బీఐ 90వ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో ఆర్బీఐ, విద్యార్థులకు ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన,ఆర్థిక క్రమశిక్షణపై ఆన్‌లైన్ క్విజ్‌ని మూడు దశలలో నిర్వహిస్తోందని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఆన్‌లైన్ క్విజ్ పోటీల పోస్టర్ ను విద్యార్థులకు LDM విశ్వనాథ్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు..ఈ సందర్బంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆర్బీఐ ఆన్‌లైన్ క్విజ్‌ని మూడు దశలలో నిర్వహిస్తోందని,వాటిలో జాతీయ స్థాయి జోనల్ స్థాయి,రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. అందులో జాతీయ స్థాయి ప్రథమ బహుమతి 10 లక్షలు, ద్వితీయ బహుమతి 8 లక్షలు, తృతీయ బహుమతి 6 లక్షలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భారతదేశం 5 జోన్‌లుగా విభజించబడిందని, అందులో జోనల్ స్థాయి1వ బహుమతి 5 లక్షలు, 2వ బహుమతి 4 లక్షలు, 3వ బహుమతి 3 లక్షలు గా ఉన్నాయని తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయి 1వ బహుమతి 2 లక్షలు, 2వ బహుమతి 1.5 లక్షలు, బహుమతి ఒక లక్ష రూపాయలుగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర స్థాయి ఎంపిక కోసం ఆన్‌లైన్ క్విజ్ నిర్వహణ ఉంటుందని, సెప్టెంబరు1, 1999న లేదా ఆ తర్వాత జన్మించిన (సెప్టెంబర్ 1.2024 నాటికి 25 ఏళ్లలోపు) విద్యార్థులు అర్హులని, జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. క్విజ్ పోటీలలో పాల్గొనదలచిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ కొరకు www.rbi90quiz.in/students/register వెబ్సైట్ ను చూడాలని తెలిపారు. సందేహాల నివృత్తికి www.rbi90q uiz.in/faqs వెబ్సైట్ చెక్ చేయాలని, క్విజ్ ప్రాక్టీస్ కొరకు www.rbi90quiz.in/practice-quiz వెబ్సైట్ చూడాలని సూచించారు.