సరస్వతీ అంత్య పుష్కరాల ప్రారంభం-కంచి స్వామీ శ్రీ విజయేంద్ర సరస్వతీ తొలి పుష్కర స్నానం
రాష్ట్ర గవర్నర్..
హైదరాబాద్: కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేసింది. పుష్కర స్నానాలు మే 21వ తేదీ నుండి 12 రోజుల పాటు (జూన్ 1 వరకు) జరగనున్నాయి. ఈ పుష్కరాలకు 30 నుండి 40 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.

కంచి పీఠాధిపతి జగద్గురు:- పుష్కరాల తొలిరోజైన 21వ తేదీ తెల్లవారు జామున 5.43 గంటలకు కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాలు పుష్కర స్నానం చేసి అంత్య పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. 21 వ తేదీ నుండి జూన్ 1 వతేదీ వరకు ప్రతీ రోజూ ఒక ప్రముఖ పీఠం స్వామిజీ ఈ పుష్కారాల్లో పాల్గొని పుణ్య స్నానం చేస్తారు. ప్రతీరోజూ ఉదయం హోమాల నిర్వహణ, సాయంత్రం పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 90 షటిల్ బస్సులను ఏర్పాటు చేశారు. రెస్క్యూ బృందాలతోపాటు ప్రత్యేక శిక్షణ పొందిన 100 మంది గజ ఈతగాళ్లను సరస్వతీ ఘాట్, నదీ ప్రాంతంలో నియమించారు.
245 ఎకరాల్లో 1.70 లక్షల వాహనాల పార్కింగ్:- ఈసారి సరస్వతీ అంత్య పుష్కారాలకు లక్షా 70 వేల వాహనాలు వస్తాయని అంచనా వేసి వీటికి గాను 245 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
100 మంది గజ ఈతగాళ్ల నియామకం:- పుష్కర స్నానాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సుమారు 100 మంది గజ ఈతగాళ్లను నియమించారు. వీటితోపాటు సెఫ్టీ బోట్స్, లైఫ్ రింగ్స్, ఎస్.డి.ఆర్.ఎఫ్ టీంలను నియమించారు. పుష్కర కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు మీడియా సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు.

