AP&TG

గ్రీన్ బెల్ట్,శబ్ద కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను తప్పనిసరి- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఎవరికీ మినహాయింపులు లేవు..

అమరావతి: దేశ పురోగతికి పరిశ్రమలు ఎంత అవసరమో… ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్ర్త సాంకేతికల శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కొన్ని పరిశ్రమలు కేవలం లాభాల కోసమే చూస్తూ నిబంధనలను పక్కనబెట్టి  జనావాసాల మధ్య కాలుష్యాన్ని వెదజల్లడం సరికాదన్నారు.శబ్ద కాలుష్య నియంత్రణపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు కచ్చితంగా పాటించాలన్నారు. మత పరమైన, సాంస్కృతిక కార్యక్రమాల పేరిట ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదన్నారు. బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “కొన్ని ప్రాంతాల్లో జనావాసాలకు అత్యంత సమీపంలో మైనింగ్ కోసం పేలుళ్లు చేయడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురవుతున్నామని, పేలుళ్లు దాటికి ఇళ్లకు బీటలు వారి ఆర్థికంగా నష్టపోతున్నామని బాధితుల నుంచి ఫిర్యాదు వస్తున్నాయి.  కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన పర్యావరణ ప్రమాణాలను అన్ని మైనింగ్ సంస్థలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. 

ఎవరికీ మినహాయింపులు లేవు:- శబ్ద కాలుష్యం నియంత్రణలో సుప్రీం కోర్టు ఉత్తర్వులు, కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి నిబంధనలు పరిశ్రమలు, సంస్థలు, ప్రార్థనా మందిరాలు కచ్చితంగా పాటించాలి. ఇండస్ర్టియల్, కమర్షియల్, రెసిడెన్సియల్, సెన్సిటివ్ జోన్లలో నిర్దేశిత డెసిబెల్ పరిమితులను కచ్చితంగా పాటించాలి. ప్రార్థనా మందిరాలైనా జోన్ల వారీగా నిర్దేశించిన శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాల్సిందే… ఇందులో ఎవరికీ మినహాయింపులు లేవు. 

నెల్లూరు జిల్లాలో కొన్ని పరిశ్రమలు వైట్ కేటగిరి కింద రిజిస్టర్ అయి, నిబంధనలకు విరుద్ధంగా దుర్వాసన, కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. బయటకు అస్సలు కాలుష్యం కలిగించని పరిశ్రమలు అని చెప్పుకుంటూ ఆర్గానిక్ వేస్ట్, రసాయన వ్యర్ధాలను బయటకు వదులుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరిపి పరిశ్రమల నుంచి దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలి.

నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం:- గాలి నాణ్యతను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం. దేశంలో అత్యంత కాలుష్యపూరిత నగరాలలో ప్రమాదకరమైన సూక్ష్మ ధూళి కణాల స్థాయిలను 40 శాతం వరకు తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో 13 నగరాలు ఎంపిక చేసి  దాదాపు రూ.400 కోట్ల నిధులను కేటాయించారు.వాటిని జాగ్రత్తగా వినియోగించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల”ని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలిలో సిబ్బంది కొరతపై అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురాగా.. దీనిపై సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్ వెంటనే సంబంధిత ఫైలును ముందుకు తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *