AP&TGPOLITICS

రాష్ట్రంలో ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరివి హత్యా రాజకీయాలు, గన్ కల్చర్లు ?-మాజీ సీ.ఎం జగన్

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్ కల్చర్? ఎవరివి హత్యా రాజకీయాలు అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలోని శవరాజకీయాలపై చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలంటూ దాదాపు 175 ప్రశ్నలను సంధించారు.

గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ, వైసీపీపై బురద జల్లేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని మండిపడ్డాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు కథలు అల్లుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా తాత రాజిరెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కదా అని నిలదీశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాజిరెడ్డి హత్య జరిగిందని తెలిపారు.1999 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజారెడ్డిని చంపేశారని పేర్కొన్నారు. వైఎస్సార్‌ను కేవలం పులివెందులకు కట్టడి చేసి, రాజకీయంగా లబ్ధి పొందాలన్నది ఇందులో రాజకీయ కోణమని ఆరోపించారు.

రాజారెడ్డి కేసులో దోషులను హైదరాబాద్ టీడీపీ సెంట్రల్ ఆఫీసులో, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో దాచిపెట్టి, అధికార దుర్వినియోగం చేసి, వారిని రక్షించింది ఎవరు అని ప్రశ్నించారు. ఎవరిది క్రిమినల్ బ్రెయిన్ అంటూ నిలదీశారు. రాజారెడ్డి హత్య కేసులో నిందితులు జైలుకు వెళ్లకుండా ఎవరు కాపాడారు? ఎవరిది గొడ్డలి పార్టీ అని ప్రశ్నించారు. తన తండ్రి విషయంలోనూ ఇదే జరిగిందని ఆరోపించారు. అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు అన్నారని, ఆ తర్వాత నాలుగు రోజులకే ప్రమాదంలో వైఎస్ఆర్ మరణించారని తెలిపారు. అవసరమైతే అసెంబ్లీ క్లిప్పింగ్‌లు చూడాలన్నారు. మేం బాధితులం కానీ మాపైనే తిరిగి తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

మా చిన్నాన వివేకానందరెడ్డిని తానే హత్య చేశానని చెప్పిన దస్తగిరి ఇవాళ దర్జాగా కారుల్లో తిరుగుతున్నాడని.. చంద్రబాబు లాయర్ లూథ్రానే దస్తగిరికి లాయర్‌గా ఉన్నాడని తెలిపారు. మరి ఎవరిది క్రిమినల్ మైండ్ అని ప్రశ్నించారు. చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకుని టపాటపామని ఇద్దరిని కాల్చిపడేయలేదా? మరి ఎవరిది గన్ కల్చర్ అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోతే.. పరామర్శ కోసం వెళ్లి కేటీఆర్‌తో చంద్రబాబు పొత్తులు మాట్లాడలేదా అని ప్రశ్నించారు. మరి ఎవరివి శవ రాజకీయాలు అని నిలదీశారు. అంతెందుకు సొంత కూతుర్ని ఇచ్చి, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీని, ఆయన పార్టీని లాక్కుని, చనిపోయాలా చేసింది చంద్రబాబు నాయుడు కదా? అని ప్రశ్నించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *