సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరికట్టాలి-కలెక్టర్ హిమాన్షు శుక్ల
కమిషనర్ నందన్..
నెల్లూరు: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల భవిష్యత్తులో తీవ్ర పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపునిచ్చారు. శనివారం “స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా నగరంలోని వి.ఆర్.సి గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని మున్సిపల్ కమిషనర్ నందన్ తో కలిసి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రారంభించారు.
వి.ఆర్.సి గ్రౌండ్ నుంచి గాంధీ బొమ్మ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు.“ప్లాస్టిక్‌ను అరికట్టాలి”, “పర్యావరణాన్ని కాపాడాలి” వంటి నినాదాలతో ర్యాలీ కొనసాగింది.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా ఈ నెల థీమ్‌గా “ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్”ను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, పర్యావరణహిత ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ థీమ్ లక్ష్యంగా చెప్పారు.
మున్సిపల్ కమిషనర్ నందన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం “స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి, పూర్తిగా ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.అనంతరం స్వర్ణాంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేసి అందరికీ క్లాత్ సంచులను పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, వి ఆర్ సి వాకర్స్ అసోసియేషన్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

