పోర్టులు,స్మార్ట్ పారిశ్రామిక వాడలపై సమగ్ర అధ్యయనం చేసిన మంత్రుల బృందం
సింగపూర్‌లో మంత్రులు..
ఆటోమేషన్, AI సాంకేతికత పరిశీలన..
ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..
అమరావతి: సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం మూడవ రోజు కీలకమైన అంశాలపై అధ్యయనం చేసింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పోర్టుల ఆధునీకరణ-స్మార్ట్ సిటీల నిర్మాణం లక్ష్యంగా మంత్రులు పి. నారాయణ, అచ్చెన్నాయుడు, బి.సి. జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్,అనగాని సత్యప్రసాద్ లు పలు కీలక సంస్థలను సందర్శించారు.
ప్రపంచస్థాయి పోర్ట్ టెక్నాలజీపై:- తొలుత ప్రపంచ ప్రసిద్ధ PSA (Port of Singapore Authority) ను సందర్శించింది. పోర్టులో కంటైనర్ల తరలింపు కోసం వినియోగిస్తున్న డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాల (Automated Guided Vehicles) , భారీ క్రేన్లను ఆపరేటర్లు నేరుగా కాకుండా, కంట్రోల్ రూమ్ నుండి రిమోట్ ద్వారా ఎలా నియంత్రిస్తున్నారో అధికారులు మంత్రులకు వివరించారు.షిప్పింగ్ మరియు లాజిస్టిక్స్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు స్మార్ట్ వ్యవస్థలను అనుసంధానం చేయడం ద్వారా సమయాన్ని, ఖర్చును ఎలా ఆదా చేస్తున్నారో మంత్రుల బృందం అధ్యయనం చేసింది.
సింగపూర్ ‘JTC’ నమూనాపై:- సింగపూర్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న JTC కార్పొరేషన్ (గతంలో జురాంగ్ టౌన్ కార్పొరేషన్) ను మంత్రుల బృందం సందర్శించింది. వాణిజ్య-పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ, సింగపూర్‌ను అంతర్జాతీయ పారిశ్రామిక కేంద్రంగా మార్చిన తీరును ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు JTC రిటైర్డ్ అసిస్టెంట్ సీఈవో సీ కీ పోక్(Seah Kee Pok) వివరించారు..
భూమి కొరత ఉన్న సింగపూర్‌లో:- ముఖ్యంగా పుంగోల్ డిజిటల్ డిస్ట్రిక్ట్ వంటి చోట్ల డిజిటల్ నెట్‌వర్క్ మరియు పారిశ్రామిక అవసరాలను ఏ విధంగా అనుసంధానం చేశారో అధ్యయనం చేశారు.భూమి కొరత ఉన్న సింగపూర్‌లో, చమురు నిల్వ కోసం భూగర్భంలో నిర్మించిన జురాంగ్ రాక్ కేవర్న్స్ మంత్రుల బృందాన్ని అసక్తిగా పరిశీలించారు. ఆగ్నేయాసియాలోనే మొదటిదైన ఈ ప్రాజెక్ట్, భూమి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు భూమిని ఎంత సమర్థవంతంగా వాడుకోవచ్చో నిరూపించింది. ఏపీలోని తీర ప్రాంతాల్లో ఇటువంటి వినూత్న స్టోరేజ్ పద్ధతులపై మంత్రులు చర్చించారు. పర్యావరణానికి హాని కలగకుండా పారిశ్రామిక వృద్ధిని ఎలా సాధించవచ్చో JTC రిటైర్డ్ అసిస్టెంట్ సీఈవో సీ కీ పోక్ (Seah Kee Pok) వివరించారు. నెట్-జీరో ఉద్గారాల లక్ష్యంతో సింగపూర్ చేపడుతున్న గ్రీన్ ప్రాజెక్టుల అమలు విధానాన్ని మంత్రులు అడిగి తెలుసుకున్నారు.
సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ సమావేశం:- పర్యటనలో భాగంగా సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (SBF) ప్రతినిధులతో మంత్రులు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. SBF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమంత టెయో, గ్లోబల్ కమర్షియల్ లీడర్ అమర్‌ప్రీత్ సింగ్, ఇండియా బిజినెస్ కమిటీ ఛైర్మన్ ప్రసూన్ ముఖర్జీలతో సమావేశమై ఏపీలో పెట్టుబడి అవకాశాలను మంత్రులు వివరించారు.ముఖ్యంగా రాజధాని అమరావతి, గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్-లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.

