జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ.3,063 కోట్లు మంజూరు-కలెక్టర్
నెల్లూరు: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ నిధులను సమర్థవంతంగా వినియోగించి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో 2026–2027 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన బడ్జెట్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2026–2027 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.3,063.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రతి శాఖ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఈ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.
బడ్జెట్‌పై పూర్తి అవగాహన:- గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమ రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాస్థాయి అధికారులందరూ తమ శాఖలకు కేటాయించిన బడ్జెట్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వం మంజూరు చేసిన ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, డిఆర్‌వో విజయ్‌కుమార్, సిపివో నరసింహారావు, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, జడ్పీ సిఇవో శ్రీధర్‌రెడ్డి, డిపివో వసుమతి, డ్వామా, ఐసిడిఎస్ పీడీలు గంగాభవాని, హేనాసుజన్ తదితరులు పాల్గొన్నారు.

