పచ్చదనమే భావి తరాల భద్రతకు పునాది-నాగబాబు
పర్యావరణ పరిరక్షణకు 20 ఏళ్ల ప్రణాళికతో..
తాటి చెట్లు, మడ అడవులతో తీర ప్రాంతాల రక్షణ..
పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలి..
అమరావతి: వాతావరణ సమతుల్యతను పరిరక్షించడంతో పాటు జీవవైవిధ్యం, జీవరాశుల మనుగడను కాపాడుకోవడానికి విస్తృత స్థాయిలో పచ్చదనాన్ని పెంపొందించడం అత్యంత అవసరమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు పేర్కొన్నారు. మొక్కలు నాటడం కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, భావి తరాల భవిష్యత్తును కాపాడే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ అనేది ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో పూర్తయ్యే కార్యక్రమం కాదని, రాబోయే తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో, నిరంతర కృషితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గురువారం బాపట్ల జిల్లా సూర్యలంకలో పర్యటించారు. సముద్రపు కోతను అరికట్టడానికి విద్యార్థులతో కలిసి తాటి చెట్లను నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మొక్క నాటడంతోనే బాధ్యత పూర్తి కాదు:- ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ “గ్రేట్ గ్రీన్ వాల్ వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పర్యావరణం గురించి పుస్తకాల్లో చదవడం, కాగితాలపై అవగాహన పొందడం కంటే పిల్లలు, పెద్దలు స్వయంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణలో భాగస్వాములు కావడం ద్వారా ప్రకృతితో మరింత గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, యువతతో పాటు సమాజంలోని ప్రతి వర్గాన్ని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తాం. మొక్క నాటడంతోనే బాధ్యత పూర్తి కాదని, అది ఆరోగ్యంగా ఎదిగి పెద్ద చెట్టుగా మారే వరకు సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. మొక్కల పెంపకాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, భావితరాలకు పచ్చని, సురక్షితమైన భవిష్యత్తును అందించే సామాజిక బాధ్యతగా భావించాలి.

