పేదలకు సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యం-మంత్రి పొంగూరు నారాయణ
332 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు..
మార్చి 31 నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి..
అదనంగా రూ.4,500 కోట్లు కేటాయింపు..
మరో 1,156 ఫ్లాట్లను అర్హులకు పారదర్శకంగా కేటాయిస్తాం..
నెల్లూరు: పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని అర్హులైన పేద కుటుంబాలకు పారదర్శకంగా నాణ్యమైన ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నెల్లూరు వెంకటేశ్వరపురంలో నిర్వహించిన టిడ్కో గృహాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ తన సతీమణి పొంగూరు రమాదేవితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం టిడ్కో గృహాలను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, చీరలు, మిఠాయిలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మిగిలిన గృహ నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు అదనంగా రూ.4,500 కోట్లు కేటాయించిందని, వచ్చే మార్చి 31 నాటికి టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.
మిగిలిన 1,156 ఖాళీ ఫ్లాట్లను కూడా:- నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం, అల్లీపురం, అక్కచెరువుపాడు, కల్లూరుపల్లి ప్రాంతాల్లో గతంలో రద్దయిన, ఖాళీగా ఉన్న ఫ్లాట్లను గుర్తించి మొత్తం 332 మంది లబ్ధిదారులకు సుమారు రూ.35 కోట్ల విలువైన ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఇందులో నగరపాలక సంస్థ పరిధిలో 155 ఇళ్లను లబ్ధిదారులకు ఎలాంటి ఆర్థిక వాటా లేకుండా పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. మెప్మా పరిధిలో తొలి విడతగా 177 ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు తమ వాటాగా రూ.85 లక్షలు చెల్లించారని, వీరికి త్వరలోనే రూ.8 కోట్ల రుణాలు ఇప్పించి, ఒక్కో ఇంటిని రూ.12 లక్షల యూనిట్ విలువతో పూర్తి చేయిస్తామని వివరించారు. ఇప్పటివరకు నెల్లూరు అర్బన్ లోకల్ బాడీ పరిధిలో 1,724 మందికి రుణాల మంజూరు పూర్తయిందని తెలిపారు. మిగిలిన 1,156 ఖాళీ ఫ్లాట్లను కూడా నెల్లూరు నగరపాలక సంస్థ, మెప్మా సమన్వయంతో అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా కేటాయిస్తామని వెల్లడించారు.

