DISTRICTSNATIONAL

రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్ష వరకు ఉచిత నగదు రహిత వైద్యం-జిల్లా కలెక్టర్

రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం..

పోలీసు శాఖ eDAR పోర్టల్‌లో నమోదు చేయడం..

గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో..

అర్హులైన ప్రమాద బాధితులకు ఈ పథకం..

నెల్లూరు: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించి, ప్రాణనష్టాన్ని నివారించడంతో పాటు, బాధిత కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం పీఎం రహత్ (PM-RAHAT – Prime Minister Road Accident Victims’ Hospitalization and Assured Treatment) పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ పథకం కింద మోటారు వాహనాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన ప్రతి బాధితుడికి, ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్ఠంగా 7 రోజుల వరకు లేదా రూ.1.50 లక్షల పరిమితి వరకు, ఏది ముందుగా పూర్తయితే అంతవరకు నగదు రహిత వైద్య చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ఆదాయ పరిమితి, వాహన రకం వంటి అంశాలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రమాద బాధితులకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు.

గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో:- ప్రమాద బాధితులను పథకం కింద గుర్తింపు పొందిన (Designated) ఆసుపత్రుల్లో చేర్పించి, అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు గోల్డెన్ అవర్‌లో వైద్యం అందించడం అత్యంత కీలకమని, ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.

పోలీసు శాఖ eDAR పోర్టల్‌లో నమోదు చేయడం:- ఈ పథకం అమలులో పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఆసుపత్రుల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రమాద వివరాలను పోలీసు శాఖ eDAR (Electronic Detailed Accident Report) పోర్టల్‌లో నమోదు చేయడం, ఆసుపత్రులు సంబంధిత ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా బాధితుల వివరాలను ధృవీకరించి, నగదు రహిత చికిత్స అందించే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఈ పథకానికి సంబంధించి తమకు ఉన్న గుర్తింపు, అమలు విధానం, చికిత్సా ప్రక్రియలపై అవగాహన కలిగి ఉండాలని, బాధితుల నుంచి పథకం పరిధిలోకి వచ్చే చికిత్సకు నగదు వసూలు చేయకుండా నిబంధనల ప్రకారం సేవలు అందించాలని తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా అమలు చేస్తున్న ఈ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ప్రమాద బాధితులకు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం ఆలస్యం కాకుండా చూడాలని కలెక్టర్ తెలిపారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *