మూడు ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
విశాఖ, తిరుపతి, అమరావతి ప్రాంతాల్లో భారీ పెట్టుబడులు..
లక్షలాది ఉద్యోగాల కల్పనే లక్ష్యం..
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ సమతుల్య అభివృద్ధి, భారీ పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా విశాఖపట్నం, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మూడు ఆర్థిక ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల పురోగతిపై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజంటేషన్ ఇచ్చారు.
ఉత్తరాంధ్రలో పోర్టులు, ఐటీ, డేటా సెంటర్లు, భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. రాయలసీమలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, గ్రీన్ ఎనర్జీ రంగాలను అభివృద్ధి చేయనున్నారు. అమరావతి ప్రాంతంలో క్వాంటం టెక్నాలజీ, ఐటీ, లాజిస్టిక్స్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, అగ్రి వాల్యూ చైన్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
విశాఖ ఎకనమిక్ రీజియన్:- విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిధిలో వివిధ శాఖల ద్వారా 167 అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించగా, ఇప్పటికే 64 పనులను ప్రారంభించారు. ఈ ప్రాంతానికి యాంకర్ ప్రాజెక్టుగా వైజాగ్ బే సిటీని అభివృద్ధి చేయనున్నారు. మధురవాడ, కాపులుప్పాడ, ఆనందపురం ప్రాంతాల్లో ఐటీ, డేటా సెంటర్ హబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. విశాఖలో స్టీల్ సిటీ, కాకినాడలో ఇండస్ట్రియల్ సిటీ, పోర్టుల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 15 నుంచి 20 కొత్త ఐటీ సంస్థలను ఆకర్షించడంతోపాటు ఇప్పటికే ఉన్న సంస్థల ద్వారా 2 లక్షల ఉద్యోగాల హామీని కార్యరూపంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తీర ప్రాంత అభివృద్ధి, కోనసీమ బ్యాక్‌వాటర్స్, అరకు, మారేడుమిల్లి ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులపైనా దృష్టి సారించారు.
తిరుపతి ఎకనమిక్ రీజియన్‌లో పారిశ్రామిక క్లస్టర్లు:- తిరుపతి ఎకనమిక్ రీజియన్ పరిధిలో అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, స్పేస్, ఎయిర్‌క్రాఫ్ట్, ఆటోమొబైల్, ఈవీ, డిఫెన్స్, టూరిజం, నాలెడ్జ్ రంగాలను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలోని 87 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో 66 ప్రాజెక్టుల పెట్టుబడులు ఈ ప్రాంత పరిధిలోకి వస్తున్నాయి. హార్టికల్చర్ హబ్‌లో భాగంగా డెయిరీ ప్రాసెసింగ్, మీట్ అండ్ పౌల్ట్రీ, ఆయిల్ పామ్ ప్రాసెసింగ్, టెర్మినల్ మార్కెట్ల వంటి క్లస్టర్ల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ రీజియన్ పరిధిలోని 14 పట్టణాలను వివిధ రంగాలకు అనుగుణంగా పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందించారు.
అమరావతి ఆర్థిక ప్రాంతంలో:- అమరావతి ఆర్థిక ప్రాంతంలో 48 ప్రధాన ప్రాజెక్టుల ద్వారా రూ.4.65 లక్షల కోట్ల పెట్టుబడులను గ్రౌండింగ్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణాన్ని పూర్తి చేసి ఎగుమతులు, పారిశ్రామిక అభివృద్ధి, లాజిస్టిక్స్ రంగాలకు ఊతమివ్వాలని నిర్ణయించింది. కోస్టల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా సూర్యలంక, ఓడరేవు, రామాపురం, చినగంజాం, నిజాంపట్నం, దిండి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. మూడు ఎకనమిక్ రీజియన్లలో రంగాల వారీగా పెట్టుబడులను ఆకర్షించి, పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

