మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశం అయిన పవన్ కళ్యాణ్
ఆడ పులులు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు..
అమరావతి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మంగళవారం ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి రెండు ఆడ పులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య ఫలవంతమైన చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు.
రెండు ఆడ పులులు ఇచ్చేందుకు:- ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ కు రెండు ఆడ పులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వారు అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది. తూర్పు కనుమల్లో ఆడ పులుల ప్రవేశంతో అంతరసంతానోత్పత్తి (Inbreeding) సమస్యలను అధిగమించడంతోపాటు, జన్యు వైవిధ్యం పెరిగి, పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుంది. తద్వారా తూర్పు కనుమలలో ఆరోగ్యకరమైన, స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుంది.

