కల్తీ మద్యం త్రాగి 15 మంది మృతి
అమరావతి: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కల్తీ మద్యం విషాదం చోటుచేసుకుంది. పుణె, పింప్రి-చింఛ్వాడ్ జంట నగరాల్లో ఇప్పటివరకు 15 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కల్తీ మద్యం సేవించిన అనంతరం బాధితులు ఒక్కసారిగా వాంతులు, కంటిచూపు మందగించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలతో కుప్పకూలినట్లు సమాచారం. వెంటనే వారిని సమీప ఆస్పత్రులకు తరలించినప్పటికీ పలువురు చికిత్స పొందుతూ మృతిచెందారు.
స్థానికులు తెలిపిన సమాచారం మేరకు, బాధితులలో పింప్రి చించ్వాడ్కు చెందిన 10 మంది, పూణేలోని హడప్సర్కు చెందిన ఐదుగురు ఉన్నారు. వీరంతా వాన్వాడి ప్రాంతంలో కల్తీ మద్యం సేవించినట్లు సమాచారం. పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో మద్యం సిండికేట్ కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారు.వీరిలో యోగేష్ వాంఖేడే ఒకడు. మరణించిన 15 మంది వాంఖేడే ఇంట్లో కల్తీ మద్యం సేవించారు.మద్యంలో విషపూరితమైన మిథనాల్ రసాయనాన్ని కలిపి ఉండవచ్చని, దానివల్లే ఈ మరణాలు సంభవించి ఉండవచ్చని అనుమానం ఉందని స్థానిక అధికారి ఒకరు వెల్లడించారు.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్:- ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఘటనపై స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కల్తీ మద్యం తయారీ, విక్రయాల్లో పాల్గొన్నవారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు పింప్రి ఏసీపీ సచిన్ హిరే వెల్లడించారు. ఈ దుర్ఘటనకు బాధ్యులైన మరికొంత మందిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది. అక్రమంగా కల్తీ మద్యం తయారు చేసిన ప్రదేశాన్ని పోలీసులు గుర్తించారు.

