రోడ్డు ప్రమాదాల నివారణకు V2V – Vehicle to Vehicle కొత్త ముసాయిదాను విడుదల
ఆకస్మిక బ్రేకింగ్, ఎదురుగా ఢీకొనే ప్రమాదం,లేన్ మార్పులు..
అమరావతి: దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మోటారు వాహనాలలో వెహికల్-టు-వెహికల్ (V2V) కమ్యూనికేషన్ వ్యవస్థలను దశలవారీగా అమలు చేయడం కోసం, రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖ, సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989కి సవరణలను ప్రతిపాదిస్తూ ఒక ముసాయిదా నోటిఫికేషన్‌ను సోమవారం జారీ చేసింది. V2V-ఇతర ‘ఇంటెలిజెంట్ ట్రాన్స్ పోర్టేషన్ సిస్టమ్’ (ITS) అప్లికేషన్ల కోసం 5.875 GHz నుండి 5.925 GHz వరకు గల ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను కేటాయించారు.
ఎదురుగా ఢీకొనే ప్రమాదం:- V2V కమ్యూనికేషన్ వ్యవస్థతో సమీపంలోని వాహనాలు వాటి వేగం, స్థానం, దిశ, లేన్లు మార్పులు మొదలైన రియల్ టైమ్ సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ సమాచారం ఆకస్మిక బ్రేకింగ్, ఎదురుగా ఢీకొనే ప్రమాదం,లేన్ మార్పులు-ఎమర్జన్సీ వాహనాల రాక వంటి భద్రతకు కీలకమైన పరిస్థితులలో డ్రైవర్లకు లేదా వాహన వ్యవస్థలకు ముందస్తు హెచ్చరికలను అందిస్తూంది. . దీంతో డ్రైవర్లు అప్రమత్తమై ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1వ తేది 2027 నుంచి దశలవారీగా అమల్లోకి తీసుకురానుంది. రోడ్డుపై ప్రయాణించిన అన్ని కేటగిరి వాహనలు ఈ వ్యవస్థ పరిధిలోకి వస్తాయి.
కేటగిరి- L: ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు-ఎలక్ట్రిక్ స్కూటర్లు.
కేటగిరి- M: ప్రయాణికుల కార్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు (SUVలు), టాక్సీలు-బస్సులు.
కేటగిరి- N: వాణిజ్య ట్రక్కులు, పికప్ ట్రక్కులు-సరుకు రవాణా వాహనాలు.
అక్టోబర్ 1, 2027:– V2V వ్యవస్థను ఐచ్ఛికంగా అమర్చుకున్న ఏ వాహనమైనా, కొత్తగా నిర్దేశించిన AIS-230 భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి.
అక్టోబర్ 1, 2028:- L, M-N కేటగిరిలకు చెందిన అన్ని కొత్త వాహనాలకు AIS-230 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే V2V కమ్యూనికేషన్ వ్యవస్థలను అమర్చడం తప్పనిసరి మారనున్నది.

