ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు కారీరిష్టి యాగం, వరుణయాగం, పర్జన్యశాంతి హోమం
తిరుమల: రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ప్రార్థిస్తూ ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు వరుణయాగ, పర్జన్యశాంతి సహిత కారీరిష్టి యాగాలను నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 32 మంది వేద, శ్రౌత, స్మార్త పండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొంటారు.ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు.
కార్యక్రమాల వివరాలు:– ఆగస్టు 30న సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్పణ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్ వరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 3వ తేది వరకు ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వరుణయాగం, కారీరిష్టి, పర్జన్యశాంతి కార్యక్రమాలతో పాటు ఏడు వేదశాఖల పారాయణం, రామాయణం, సుందరకాండ, విరాటపర్వం, ఋష్యశృంగ ధ్యాన పారాయణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
గోగర్భం డ్యామ్ వద్ద వరుణ, పర్జన్య మంత్ర అనుష్ఠానం నిర్వహిస్తారు.
సాయంత్రం 6 గం.నుండి రా.8.గం వరకు ధర్మగిరిలో అగ్నిహోత్ర అనుష్ఠానం, ఏడు వేదశాఖల పారాయణం జరుగుతుంది.
సెప్టెంబర్ 3న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు.

