AP&TG

తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు-మంత్రి కందుల దుర్గేష్

మాతృభాషకు సముచిత పీఠం..

సెప్టెంబర్ మొదటి వారంలో ‘నంది నాటకోత్సవాల’పై కీలక ప్రకటన..

పురస్కార గ్రహీతలకు రూ. 25,000 నగదు..

జ్ఞాపిక, ప్రశంసా పత్రం బహూకరణ..

అమరావతి: సెప్టెంబర్ మొదటి వారంలో నంది నాటకోత్సవాల నిర్వహణపై కీలక ప్రకటన చేస్తామని, ఏడాదిలోనే వీటిని కూటమి ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తుందని సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.విజయవాడ గవర్నర్ పేటలోని డా.బి.ఆర్. అంబేద్కర్ స్వరాజ్ మైదానంలో ఉన్న డా. బీ. ఆర్. అంబేద్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తి పంతులు 163వ జయంతి (తెలుగు భాషా దినోత్సవం) వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ 19 మంది ప్రముఖులకు ‘తెలుగు భాషా పురస్కారాలు-2026’ అందజేశారు. పురస్కార గ్రహీతలకు ప్రశంసా పత్రం, జ్ఞాపికతో పాటు రూ. 25,000 నగదు బహూకరించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రజలు మాట్లాడే భాషకు విద్యా సాహిత్య రంగాల్లో సమచిత స్థానం కల్పించేందుకు కృషి చేసిన గిడుగు రామమూర్తి పంతులు  చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు..

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. గ్రంథాలకే పరిమితమైన తెలుగును ప్రజాక్షేత్రంలోకి తెచ్చిన మహోన్నతుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు అని కొనియాడారు. కందుకూరి, గురజాడ, గిడుగుల కృషి వల్లే వ్యావహారిక భాష ఉద్యమం రూపుదిద్దుకుందన్నారు. సవర భాషకు లిపిని రూపొందించి, బ్రిటిష్ ప్రభుత్వం తనకు ఇచ్చిన పారితోషికాన్ని సైతం ఆదివాసీల విద్యాభివృద్ధికి వెచ్చించిన త్యాగధనుడు, సంఘసంస్కర్త  గిడుగు అని గుర్తుచేశారు. తెలుగు భాషా పురస్కారాల ఎంపికకు సంబంధించిన జి.ఓ ను కూడా తెలుగులోనే జారీ చేయడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు మాతృభాషకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ప్రతి జిల్లాలో వ్యావహారిక భాషా సంఘాల ఏర్పాటుకు సాంస్కృతిక శాఖ తరఫున పూర్తి సహకారం ఉంటుందని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికార భాషా సంఘం చైర్మన్‌కు సూచించారు. ఇంగ్లీష్, హిందీ నేర్చుకోవడం అవసరమే అయినా, మాతృభాషను మరువకూడదని పిలుపునిచ్చారు. కన్నతల్లి పాలతో పెరిగిన బిడ్డను మాతృభాషతో, పోత పాలతో పెరిగిన బిడ్డను ఆంగ్లంతో పోలుస్తూ ప్రాథమిక విద్య తెలుగులోనే సాగాలని నొక్కిచెప్పారు. ప్రతి ఏటా ఉగాది, కందుకూరి, తెలుగు భాషా పురస్కారాలను క్రమం తప్పకుండా ప్రదానం చేస్తామని వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *