AP&TG

అధునాతన ఫైర్‌ ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో..

20 వాటర్‌ బౌజర్లను సిద్దం..

25 అధునాతన అగ్నిమాపక వాహనాలు..

13 క్విక్‌ రెస్పాన్స్‌ మల్టీపర్పస్‌ ఫైర్‌ ఫైటింగ్‌ వాహనాలు..

ఫైర్‌ స్టేషన్లల్లో మౌలిక వసతులపైనా..

అమరావతి: అగ్నిప్రమాదాలు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు అగ్నిమాపకశాఖను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.15వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన సుమారు రూ.40 కోట్ల విలువైన 58 అగ్నిమాపక వాహనాలకు శుక్రవారం సీడ్ యాక్సెస్ రోడ్డులో సీఎం జెండా ఊపారు. గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులకు ఉపయోగపడేలా, ప్రమాద ప్రాంతాలకు వేగంగా చేరుకుని తక్షణమే అగ్నిమాపక సేవలు అందించేలా రూ.18.68 కోట్ల విలువైన 25 అధునాతన అగ్నిమాపక వాహనాలు అందుబాటులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. పెద్ద అగ్నిప్రమాదాల సమయంలో నిరంతర నీటి సరఫరాకు ఉపయోగపడేలా రూ.14.79 కోట్ల విలువైన 20 వాటర్‌ బౌజర్లను సిద్దంగా ఉంచుకున్నామని సీఎంకు అధికారులు చెప్పారు. ఒక్కో వాటర్‌ బౌజర్‌ 14 వేల లీటర్ల నీటిని తరలించే సామర్థ్యం కలిగి ఉంటాయని, పట్టణ, పారిశ్రామిక ప్రాంతాల్లో మంటలను అదుపు చేయడంలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయని తెలిపారు. ఇరుకైన, రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ వేగంగా చేరుకునేలా రూ.6.37 కోట్ల విలువైన 13 క్విక్‌ రెస్పాన్స్‌ మల్టీపర్పస్‌ ఫైర్‌ ఫైటింగ్‌ వాహనాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మొత్తం రూ.252.86 కోట్ల వ్యయంతో దశలవారీగా ఆధునిక వాహనాలు, పరికరాలను సమకూరుస్తున్నమన్నారు. తొలిదశలో రూ.33 కోట్ల వ్యయంతో 65 అగ్నిమాపక వాహనాలను ఇప్పటికే అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని, రెండో దశలో రూ.40 కోట్లతో 58 వాహనాలను ఇప్పుడే ప్రారంభించుకున్నమన్నారు.త్వరలో మూడో దశలోనూ మరిన్ని అగ్నిమాపక వాహనాలు, ఫైర్‌ ఫైటింగ్‌ పరికరాలను అందుబాటులోకి తీసుకుని వస్తామని, అలాగే ఫైర్‌ స్టేషన్లల్లో మౌలిక వసతులపైనా ప్రత్యేక దృష్టి సారించమని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *